నయీంనగర్ బ్రిడ్జితో పాటు కేయూ 100 ఫీట్ల రోడ్డు, సమ్మయ్య నగర్ నాలా బ్రిడ్జి పనులకు బీఆర్‌ఎస్ హయాంలోనే టెండర్లు పిలిచామని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ చెప్పారు. సోమవారం నయీంనగర్ బ్రిడ్జి, ఆ తర్వాత పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు.
2020లో వరదల కారణంగా కాలనీలు మునిగిపోతే ముంపు నివారణ కోసం అప్పటి మంత్రి కేటీఆర్ రూ.500 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో తామే పనులకు శ్రీకారం చుట్టామని, ఎలక్షన్ కోడ్ వల్ల పనులు పూర్తి చేయలేకపోయామన్నారు. నయీంనగర్ నాలా, బ్రిడ్జి నిర్మించామని చెబుతున్న రాజేందర్‌రెడ్డి ... నాలా మొత్తాన్ని వంకర టింకర కట్టించాడని ఎద్దేవా చేశారు.
కేటీఆర్‌పై, తనపై ఎమ్మెల్యే నాయిని చేస్తున్న విమర్శలు బంద్ చేయాలని సూచించారు. పోలీసుల తీరు సరిగా లేదని మండిపడ్డారు. ఆయన వెంట కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్ రాజ్‌యాదవ్, పులి రజనీకాంత్, చందర్ పాల్గొన్నారు.
