- తాజా జీడీపీ అంచనాలను పాత డేటా సీరిస్తో పోల్చొద్దు
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ కాంత్ మిశ్రా
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు 2.6% మాత్రమే ఉందనడం తప్పని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యాక్సిస్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంఠ మిశ్రా అన్నారు. జీడీపీ వృద్ధి రేటుపై చెలరేగిన వివాదంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఏప్రిల్, -జూన్ త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అధికారికంగా ప్రకటించిన 7.8 శాతం కాకుండా కేవలం 2.6 శాతమేనంటూ వస్తున్న వాదనలను ఆయన తీవ్రంగా ఖండించారు. అలాంటి లెక్కలు సరికావని, అవి అజ్ఞానంతో కూడినవని పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయితే, మాజీ ఆర్థిక కార్యదర్శి ఎస్సీ గార్గ్ తదితరులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. గత సంవత్సరానికి సంబంధించి జీడీపీ బేస్ (ప్రారంభ విలువ) లెక్కల్లో చేసిన మార్పుల వల్ల అసలు వృద్ధి చాలా తక్కువగా ఉంటుందని వాదించారు. గతేడాది జూన్ త్రైమాసికంలో ప్రస్తుత ధరల వద్ద రూ. 86 లక్షల కోట్లుగా ఉన్న జీడీపీని రూ. 80 లక్ష కోట్లకు తగ్గించారని, ఆ సర్దుబాటు చేయకపోతే ప్రస్తుత జూన్ త్రైమాసిక వృద్ధి రేటు కేవలం 2.6 శాతానికే పరిమితమయ్యేదని వారు ఆరోపించారు.
ఈ వాదనలను నీలకంఠ మిశ్రా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు. భిన్నమైన జీడీపీ సిరీస్‌లు, వేర్వేరు పద్ధతుల్లో లెక్కించిన అంచనాలను ఒకదానితో ఒకటి తప్పుగా పోల్చడం సరికాదన్నారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కొత్త జీడీపీ సిరీస్ ద్వారా కేవలం బేస్ నంబర్లను మార్చడమే కాకుండా, అంతర్గత డేటాను సరిదిద్ది, ఆర్థిక వస్తువుల అంచనా పద్ధతులను మరింత మెరుగుపరిచామని తెలిపారు. ఈ బేస్ సవరణ మార్చిలోనే అందరికీ తెలిసిన విషయమని గుర్తుచేశారు.
అలాగే, జీడీపీ వృద్ధి రేటును మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు , ప్రస్తుత ఆర్థిక నిపుణులు కృష్ణమూర్తి సుబ్రమణియన్ సమర్థించారు. ఏప్రిల్, -జూన్ త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం వృద్ధి రేటు కచ్చితమైనదేనని, దాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తున్న విధానం ఎంతో ఆధునికమైనదని స్పష్టం చేశారు. అదే విధంగా జీడీపీ గణాంకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు. పాత సిరీస్ ఆర్థిక డేటాను ప్రస్తుత ఆధునిక పద్ధతితో తప్పుగా పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
