నీరజ్ చోప్రా సంచలనం: ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్‌ మెడల్

నీరజ్ చోప్రా సంచలనం: ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్‌ మెడల్

టోక్యో: భారత యువ అథ్లెట్ నీరజ్‌ చోప్రా సంచలనం సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇవాళ (శనివారం) జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో టాప్‌లో నిలిచాడు. భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టాడు. టోక్యో ఒలింపిక్స్ మొత్తంలో భారత్‌కు వచ్చిన ఏకైన బంగారు పతకం ఇదే. అంతే కాదు మన దేశానికి ఒలింపిక్స్ చరిత్రలోనే జావెలిన్‌ త్రో పోటీల్లో మెడల్ రావడం కూడా ఇదే మొదటిసారి. ఈ గేమ్‌లో ఫస్ట్‌ మెడలే గోల్డ్ రావడం విశేషం. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్) చరిత్రలోనే భారత్ సాధించిన తొలి మెడల్‌ కూడా ఇదే. ఇన్ని స్పెషల్‌ రికార్డుల్ని సొంతమయ్యేలా చేసిన నీరజ్ చోప్రా వయసు కేవలం 23 ఏండ్లు మాత్రమే. నీరజ్ ప్రస్తుతం ఆర్మీలో సుబేదార్‌‌గా పని చేస్తున్నాడు. వ్యక్తిగత కేటగిరీలో 2008 ఒలింపిక్స్‌లో  అభినవ్ బింద్రా (షూటింగ్) గోల్డ్ మెడల్ సాధించగా.. ఈ కేటరిగీలో గోల్డ్ సాధించిన రెండో వ్యక్తిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. 

ఫైనల్ జావెలిన్ మ్యాచ్‌లో ఫస్ట్ రౌండ్‌లో 87.03 మీటర్లు, రెండో రౌండ్ 87.58 మీటర్లు, మూడో రౌండ్‌లో 76.79 మీటర్ల చొప్పున జావెలిన్‌ను విసిరాడు. నాలుగు, ఐదు రౌండ్లలో  నీరజ్ తీవ్ర ఒత్తిడికి లోను కావడంతో జావెలిన్ విసిరే సమయంలో లైన్ దాటి ముందుకు అడుగువేశాడు. దీంతో ఈ రౌండ్లలో ఫౌల్ కావడంతో పాయింట్లు లెక్కలోకి రాకుండా పోయాయి. ఆరో రౌండ్‌లో 84.25 మీటర్లు విసిరాడు. తొలి రెండు రౌండ్లలో మొత్తం 12 మంది ఫైనలిస్టుల్లో నీరజ్ చోప్రానే ఎక్కువ దూరం విసిరాడు. మూడో రౌండ్‌లో కొంత వెనకబడ్డాడు. నాలుగు, ఐదు రౌండ్లలో పూర్తిగా పాయింట్స్ కోల్పోయాడు. మళ్లీ ఆరో రౌండ్‌లో భారీ దూరం వేయడంతో ఓవరాల్‌గా మనోడే టాప్‌లో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రెండో, మూడు స్థానాల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన అథ్లెట్సే నిలిచి సిల్వర్, బ్రాంజ్ రెండు మెడల్స్ గెలుచుకున్నారు.

బుధవారం జరిగిన  ఫైనల్స్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లోనూ నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రతిభను చాటాడు. పోటీలో పాల్గొన్న అందరికంటే ఎక్కువ దూరం జావెలిన్‌ను విసిరి రికార్డు సృష్టించాడు. 86.65 మీటర్ల దూరం విసిరి ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఫైనల్‌కు చేరిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.