నీట్ పేపర్ లీక్.. మీడియా స్టింగ్ ఆపరేషన్‌లో నాశిక్ కోచింగ్ సెంటర్ గుట్టు రట్టు

నీట్ పేపర్ లీక్.. మీడియా స్టింగ్ ఆపరేషన్‌లో నాశిక్ కోచింగ్ సెంటర్ గుట్టు రట్టు

నీట్ 2026 పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ.. ప్రముఖ వార్తా సంస్థ NDTV నిర్వహించిన ఒక సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా నడుస్తున్న ‘రేణుకై కెరీర్ సెంటర్’ డైరెక్టర్ శివరాజ్ రఘునాథ్ మొతేగాంకర్ మొబైల్ ఫోన్‌లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ దొరకడంతో సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ జరిగిన వెంటనే.. నాశిక్‌లోని అదే సంస్థకు చెందిన ఒక బ్రాంచ్‌లో ఎన్‌డీటీవీ ప్రతినిధి ఒక స్టూడెంట్ సోదరుడిగా నటిస్తూ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. కౌన్సెలింగ్ కోసం వచ్చినట్టు నమ్మించి అక్కడి బ్రాంచ్ మేనేజర్‌ను మాట్లాడించగా.. కోచింగ్ సెంటర్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ కెమెరాకు చిక్కాయి.

ఆ వీడియో రికార్డింగ్‌లో నాశిక్ బ్రాంచ్ మేనేజర్ తమ సంస్థ సక్సెస్ రేటు గురించి గొప్పలు చెప్పుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. నీట్ పరీక్షలో అడిగే మొత్తం 180 ప్రశ్నలు తమ స్టడీ మెటీరియల్ నుంచే వచ్చాయని.. తమ వద్ద చేరితే విజయానికి 100 శాతం గ్యారెంటీ అంటూ హామీ ఇచ్చాడు. దేశంలోని ఎయిమ్స్ తో పాటు ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ కనీసం ఒక్క రేణుకై కెరీర్ సెంటర్ విద్యార్థి అయినా ఖచ్చితంగా ఉంటాడని ప్రగల్భాలు పలికాడు. దేశంలో మరే కోచింగ్ ఇన్స్టిట్యూట్‌కు ఇలాంటి ఫలితాలు రాలేదని, తమదే అత్యధిక పాస్ పర్సంటేజ్ అంటూ క్లెయిమ్ చేశాడు.

అంతటితో ఆగకుండా.. ఒక బుక్‌లెట్ చూపిస్తూ గత 2025 నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సైతం తమ మెటీరియల్‌తో ఎలా మ్యాచ్ అయ్యాయో వివరించాడు. రేపొద్దున ఏ తల్లిదండ్రులైనా వచ్చి ప్రూఫ్ అడిగితే.. నేరుగా తమ స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి పేజీ నంబర్, క్వశ్చన్ నంబర్‌తో సహా చూపించగలమని ఆ మెనేజర్ చెప్పుకొచ్చాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ఏ సబ్జెక్టులోనైనా 180కి 180 ప్రశ్నలు తమ బుక్స్ నుంచే వస్తాయంటూ గుట్టు విప్పాడు. అయితే ఇదంతా డైరెక్టర్ శివరాజ్ మొతేగాంకర్ అరెస్ట్ అయిన సమయంలోనే బయటపడటం గమనార్హం. ఏప్రిల్ 23న జరిగిన నీట్ పరీక్షకు ముందే సదరు డైరెక్టర్ ఒక గ్యాంగ్‌తో చేతులు కలిపి, లీకైన ప్రశ్నపత్రాన్ని, సమాధానాలను తన ఫోన్ ద్వారా సర్క్యులేట్ చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.

మరోవైపు ఈ పేపర్ లీక్ వ్యవహారం దేశ రాజకీయాలను సైతం కుదిపేస్తోంది. ఈ నీట్-యూజీ లీకేజీ కేసుపై, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణలపై సమీక్షించేందుకు పార్లమెంటరీ కమిటీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ఉన్న ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ పార్లమెంటరీ కమిటీ మే 21న అత్యవసర సమావేశం కానుంది. ఈ సమావేశానికి హాజరుకావాలంటూ ఎన్‌టీఏ ఛైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషీలకు సమన్లు జారీ చేసింది. కే రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన సంస్కరణల నివేదికను, పేపర్ లీక్‌పై జరుగుతున్న దర్యాప్తును ఈ కమిటీ పరిశీలించనుంది. మే 3న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న సమాచారంతో.. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షను ఎన్‌టీఏ రద్దు చేసింది. రద్దయిన పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు, వచ్చే ఏడాది నుండి ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఫార్మాట్‌లోకి మారుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.