కొత్త కారు కొనుగోలు చేసే ఆలోచన ఉందా..? ఏ కారు తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారా..? కొత్తగా మార్కెట్లోకి రాబోయే కార్లు ఏమున్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే మీకోసం మార్చిలో మార్కెట్లోకి రాబోయే టాప్ కార్లను పరిచయం చేస్తున్నాం.
ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లోకి ఎంటరయ్యాం. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు తమ కంపెనీ లాభాలను పెంచుకునేందుకు..ఆదాయాన్ని చిట్టా పద్దుల్లో చూపెట్టుకునేందుకు తహతహలాడుతాయి. ఇందులో భాగంగా మార్చి నెలలో కొత్త ఉత్పత్తులను ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తాయి.
అన్ని కంపెనీల వలే కార్ల కంపెనీలు కూడా మార్చి నెలలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడదల చేయబోతున్నాయి. ల్యాండ్ రోవర్,హోండా, టయోటా,ఎంజి వంటి అనేక కంపెనీల నుంచి మార్కెట్లోకి త్వరలో కార్లు రానున్నాయి.
హ్యుందాయ్ వెర్నా
హ్యూందాయ్‌కి చెందిన వెర్నా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. వెర్నా లాంఛ్ అయిన సమయంలోనే అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అయితే తాజాగా వెర్నాకు లేటెస్ట్ వెర్షన్‌ను హ్యూందాయ్ తీసుకొస్తోంది. మార్చి 21, 2023 న మార్కెట్లోకి నెక్స్ట్-జెన్ వెర్నా సెడాన్‌ను హ్యుందాయ్ విడుదల చేయబోతుంది. దీని ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి ఉంటుంది. కొత్త వెర్నా స్పోర్టివ్ లుక్ లో ఉంటుంది. గత మోడల్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. పెద్ద టచ్ స్క్రీన్ సిస్టమ్, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. 1.5లీటర్ టర్బోపెట్రోల్ ఇంజన్‌తో కూడిన కారు115 పిఎస్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండవ ఇంజిన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్. ఇది 160 పిఎస్ పవర్ మరియు 265 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
టయోటా ఇన్నోవా క్రిస్టా
ఇన్నోవా క్రిస్టా ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి వస్తుందని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. మర్చిలో మధ్యలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 2023 ఇన్నోవా క్రిస్టా మొత్తం నాలుగు ట్రిమ్స్ లో లభింస్తుంది. అవి G, GX, VX, ZX. మొదటి మూడు వేరియంట్స్ 7 లేదా 8 సీట్ల కాన్ఫిగరేషన్స్ లో అందుబాటులో ఉంటాయి. కానీ ZX వేరియంట్ మాత్రం 7 సీటర్ మోడల్లో మాత్రమే లభిస్తుంది. ఇన్నోవా క్రిస్టా మొత్తం ఐదు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. డిజైన్ పరంగా మైల్డ్ ఫేస్‌లిఫ్ట్ మాదిరిగా ఉంటుంది. ఇన్నోవా క్రిస్టా 2023 కొంత అప్డేట్ చేయబడింది. కానీ సైడ్ ప్రొఫైల్ మాత్రం ఎక్కువ అప్డేట్ కాలేదు. డీజిల్ ఇంజిన్ ఆప్షన్ తో మాత్రమే విడుదలవనుంది. 2023 ఇన్నోవా క్రిస్టాలోని 2.4 లీటర్, 4 సిలిండర్, టర్బో చార్జ్డ్, డీజిల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఎకో, పవర్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అప్డేటెడ్ ఇన్నోవా క్రిస్టాలో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉంటుంది. ఇందులో ఫుల్ కలర్డ్ TFT MID స్క్రీన్ ఉంటుంది. పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, యంబియంట్ లైటింగ్, రియర్ ఆటో ఏసీ ఉన్నాయి. ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. 7 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, త్రి పాయింట్ సీట్ బెల్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉంటాయి.
మారుతి సుజుకీ ఫ్రాంక్స్
ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2023 లో తన ఫ్రాంక్స్ కారును మారుతి సుజుకి ఆవిష్కరించింది. మార్చి నెల చివర్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారును కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మారుతి సుజుకి ఫ్రాంక్స్ వివిధ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. 6 సింగిల్-టోన్, 3 డ్యూయల్-టోన్‌తో సహా 9 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో NEXWave గ్రిల్, LEDDRL లతో కూడిన ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు, ముందు వెనుక బంపర్‌లో క్రోమ్ ఇన్‌సర్ట్‌లు ఉన్నాయి. ఈ కారు 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఉంటుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ లో ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండనున్నాయి. అంతే కాకుండా 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్, ఏఎంటీమూడు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. బూస్టర్ జెట్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్‌మిషన్ తో వస్తోంది.
ఎంజి ఎయిర్ ఈవి
ఎంజి మోటార్ ఇండియా మార్చి నెలలో ఎయిర్ ఎలక్ర్టిక్ కారును ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంజి తమ రాబోయే ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పేరును ప్రకటించింది. గ్లోబల్ ఎంజి కామెట్‌ను భారత మార్కెట్లో ఎయిర్‌గా ప్రవేశపెడుతున్నట్లు ఎంజి వెల్లడించింది. MG ఎయిర్ EV మైక్రో హ్యాచ్‌బ్యాక్ పేరుతో విడుదల కానున్న కారు.. భారతీయ మార్కెట్లో అతిచిన్న ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించబోతుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎకా
మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ను భారత మార్కెట్లో మార్చి నెలలో ప్రారంభించనుంది. EQA పరిచయంతో మెర్సిడెస్ బెంజ్ తన EV లను సామర్థ్యాన్ని భారత మార్కెట్ కు ఘనంగా చాటిచెప్పనుంది. మెర్సిడెస్ బెంజ్ EQA ధర 57 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
