V6 News

బెంగళూరులో కోహ్లీ బ్రాండ్ హోటల్‌ వన్8 కమ్యూన్ క్లోజ్.. ఏం జరిగిందంటే?

బెంగళూరులో కోహ్లీ బ్రాండ్ హోటల్‌ వన్8 కమ్యూన్ క్లోజ్.. ఏం జరిగిందంటే?

విరాట్ కోహ్లీకి బెంగళూరుతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అక్కడ ఆయన బ్రాండ్ పేరుతో నడుస్తున్న 'వన్8 కమ్యూన్' రెస్టారెంట్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. అద్దె బకాయిలు చెల్లించలేదనే కారణంతో ఈ పాపులర్ అవుట్‌లెట్ కార్యకలాపాలను నిలిపివేయాలని సివిల్ కోర్టు ఆదేశించటంతో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. 

అసలేం జరిగింది?
చిన్నస్వామి స్టేడియం సమీపంలో 2023లో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రెస్టారెంట్.. తక్కువ కాలంలోనే నగరంలో హాట్ స్పాట్‌గా మారింది. అయితే గత కొంతకాలంగా ప్రాపర్టీ యజమానికి చెల్లించాల్సిన నెలవారీ అద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు పేరుకుపోయాయి. దీంతో యజమాని కోర్టును ఆశ్రయించగా.. బకాయిలు చెల్లించే వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ముందే తప్పుకున్న కోహ్లీ
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చట్టపరమైన చిక్కులు మొదలవ్వక ముందే విరాట్ కోహ్లీ ఈ బెంగళూరు అవుట్‌లెట్ నుంచి తప్పుకున్నారట. రూల్స్ ఉల్లంఘనలు, ఆపరేషనల్ ఇబ్బందులు పదే పదే తలెత్తుతుండటంతో తన బ్రాండ్ ఇమేజ్‌ దెబ్బతినకుండా కోహ్లీ పరిస్థితి ముదరకమునుపే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు ఒక ప్రైవేట్ హాస్పిటాలిటీ కంపెనీ చూసుకుంటోంది.

Also Read : డ్రగ్స్ టెస్టులో అడ్డంగా దొరికిన పాకిస్తాన్ క్రికెటర్

కేవలం అద్దె మాత్రమే కాదు.. గతంలోనూ ఈ రెస్టారెంట్ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకపోవడం, పొగాకు నియంత్రణ చట్టం కింద స్మోకింగ్ జోన్ లేకపోవడం వంటి కారణాలతో నోటీసులు అందుకుంది. అలాగే అర్థరాత్రి అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు నడపడంపై కూడా పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.

మరి భవిష్యత్తు ఏంటి?
కోహ్లీ బ్రాండింగ్ దూరం కావడంతో.. వరుసగా చట్టపరమైన సమస్యలు చుట్టుముట్టుకున్న ఈ రెస్టారెంట్ ఆర్థికంగా దెబ్బతింది. బకాయిలు చెల్లించి, రూల్స్ ప్రకారం క్లియరెన్స్ పొందితే తప్ప ఈ ఫేమస్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ మళ్లీ తెరుచుకునే అవకాశం కనిపించటం లేదు. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఇష్టమైన ఈ అడ్డా ఇలా మూతపడటం చాలా మందిని నిరాశకు గురిచేస్తోంది.