బిహార్ లో నేడు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

బిహార్ లో నేడు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

ఆర్జేడీ, కాంగ్రెస్‌‌, లెఫ్ట్​తో కలిసి మహాకూటమి ఏర్పాటు
ఇయ్యాల సీఎంగా బాధ్యతలు.. డిప్యూటీ సీఎం తేజస్వీ
ఆర్జేడీతో నితీశ్ జట్టు కట్టడంపై బీజేపీ ఫైర్

పాట్నా/న్యూఢిల్లీ: బీహార్ రాజకీయ పరిణామాలు ఒక్కరోజులోనే వేగంగా మారిపోయాయి. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే నుంచి నితీశ్ కుమార్ బయటికి వచ్చారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆర్జేడీ, కాంగ్రెస్‌‌, లెఫ్ట్ పార్టీలతో కలిసి ‘మహా ఘట్ బంధన్‌‌’ ఏర్పాటు చేశారు. గవర్నర్‌‌‌‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం తనకుందని ప్రకటించుకున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.  డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్‌‌లో జేడీయూ, ఆర్జేడీలకు చెరో 14 మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి మూడు లేదా నాలుగు బెర్తులు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి, హెచ్‌‌ఏఎం చీఫ్ నితన్ రామ్ మాంఝీ కూడా నితీశ్‌‌కు మద్దతు పలికారు. 

రెండుసార్లు గవర్నర్ వద్దకు..

ఎన్డీయేతో నితీశ్ తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం తన అధికారిక నివాసంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో నితీశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘‘మొదట చిరాగ్ పాశ్వాన్ తిరుగుబాటును ఆసరాగా చేసుకుని, తర్వాత పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ ద్వారా జేడీయూని బలహీనపరిచాలని బీజేపీ ప్రయత్నించింది” అని ఆరోపించినట్లు సమాచారం. తర్వాత రాజ్‌‌భవన్‌‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌‌ ఫగు చౌహాన్‌‌‌‌కు సమర్పించారు. అంతకుముందు ఆర్జేడీ కూడా తమ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్యేలందరూ నితీశ్‌‌ కుమార్‌‌కు మద్దతు లేఖపై సంతకం చేసినట్లు సమాచారం. రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత రాజ్‌‌భవన్‌‌ బయట మీడియాతో మాట్లాడిన నితీశ్.. ‘‘ఎన్డీయేతో పొత్తును విరమించుకున్నాం. కూటమి నుంచి బయటికి రావాలని జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కోరుకున్నారు. అందుకే ఎన్డీయే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను” అని చెప్పారు. అటు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి ఇంటికి వెళ్లారు. అక్కడ ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, లెఫ్ట్‌‌ పార్టీలతో కూడిన ‘మహా ఘట్‌‌బంధన్’ లీడర్‌‌‌‌గా నితీశ్‌‌ను నేతలు ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి నితీశ్ మాట్లాడారు. 2017లో జరిగిన దాన్ని మరిచిపోదామని, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామని తేజస్వీతో నితీశ్ చెప్పినట్లు సమాచారం. సాయంత్రం తేజస్వీ యాదవ్‌‌తో కలిసి మరోసారి రాజ్‌‌భవన్‌‌కు వెళ్లారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం తమకుందని చెప్పారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌‌‌‌ ఫగు చౌహాన్‌‌కు సమర్పించినట్లు నితీశ్ తెలిపారు. తమకు 7 పార్టీల మద్దతు ఉందని.. ఒక స్వతంత్ర సభ్యుడు కూడా సపోర్ట్ చేస్తున్నారని వెల్లడించారు.

బీజేపీ ఎజెండాను అమలు కానివ్వం: తేజస్వీ

బీహార్‌‌‌‌లో బీజేపీ ఎజెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వబోమని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ‘‘ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తామని జేపీ నడ్డా అన్నారు. భయపెట్టడం, కొనడం మాత్రమే బీజేపీకి తెలుసు” అని విమర్శించారు. ‘‘హిందీ మాట్లాడే అన్ని ప్రాంతాల్లో.. బీజేపీకి ఎక్కడా కూటమి పార్టీలు లేవు. తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలను బీజేపీ నాశనం చేస్తుందని చరిత్ర చెబుతున్నది. పంజాబ్‌‌, మహారాష్ట్రలో ఏం జరిగిందో మనం చూశాం” అని ఆరోపించారు. గవర్నర్‌‌‌‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశంలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అని అన్నారు. 

బీజేపీయేతర ప్రభుత్వానికి సపోర్టు..: కాంగ్రెస్

లౌకిక శక్తుల బలోపేతం కోసం బీహార్‌‌‌‌లో బీజేపీయేతర ప్రభుత్వానికి సపోర్టు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆర్జేడీ, జేడీయూ కూటమిలో చేరింది. ‘‘మాది సైద్ధాంతికపరమైన పోరు.. అధికారంకోసం మేం పోరాడలే. బీజేపీయేతర ప్రభుత్వాలకు కాంగ్రెస్ మద్దతిస్తుంది’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తారీఖ్ అన్వర్ చెప్పారు. ‘బీజేపీని వీడి నితీశ్ కుమార్ వస్తున్నందున.. ఆయనకు మేం మద్దతిస్తాం’ అని అన్నారు. స్పీకర్ తోపాటు 3 కేబినెట్ బెర్త్‌‌లు లేదా 4 మంత్రి పదవులను కాంగ్రెస్ కోరుతున్నట్లు సమాచారం. 

పార్టీల బలాబలాలివీ

బీహార్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 243. ఇక్కడ ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఆ పార్టీకి 79 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 77, జేడీయూకి 45(+ ఒక ఇండిపెండెంట్), కాంగ్రెస్‌‌కు 19, సీపీఐఎంఎల్‌‌కు 12,  సీపీఐ 2, సీపీఎం 2, హెచ్‌‌ఏఎంకి నాలుగు సీట్లు ఉన్నాయి. ఎంఐఎంకు ఒక సీటు ఉంది. అయితే ప్రస్తుతం ఒక సీటులో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుత సభ్యుల సంఖ్య 242 కాగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122. 

ఎనిమిదేండ్లలో రెండోసారి..

2014 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్డీయేకి నితీశ్ కుమార్ గుడ్‌‌బై చెప్పారు. నాటి మోడీని ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కూటమి నుంచి బయటికి వచ్చారు. ఆర్జేడీతో జతకట్టారు. 2015 ఎన్నికల్లో గెలిచారు కూడా. కానీ కొన్నాళ్లకే ఆర్జేడీతో విభేదించి 2017లో మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేశారు. అధికారాన్ని నిలబెట్టుకు న్నా.. సీట్లు భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో తనను బలహీనపరి చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నారు.

22 ఏండ్లలో 8వ సారి

2000 మార్చిలో నితీశ్​ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2005 నవంబర్‌‌‌‌లో, 2010 నవంబర్‌‌‌‌ లో 2015 ఫిబ్రవరిలో, 2015 నవంబ ర్‌‌‌‌లో 2017, జులైలో 2020 నవంబ ర్‌‌‌‌లో ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం 8వ సారి బాధ్యత చేపట్టనున్నారు. 8 ఏండ్ల గ్యాప్​లో 4 సార్లు సీఎంగా ప్రమాణం చేశారు.

ద్రోహం చేశారు: బీజేపీ

ప్రజలు ఇచ్చిన తీర్పునకు నితీశ్ ద్రోహం చేశారని బీజేపీ మండిపడింది. బీహార్ జనం నితీశ్‌‌కు గుణపాఠం చెబుతారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. ‘‘తక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. మేం ఆయన్ను సీఎంను చేశాం. కానీ ఆయన ప్రజలను రెండుసార్లు మోసం చేశారు. అతను ‘అహంకారం’  అనే వ్యాధితో బాధపడుతున్నా డు” అని కేంద్ర మంత్రి అశ్విని చౌబే ఫైర్ అయ్యారు. ఆర్జేడీతో నితీశ్ జట్టు కట్టడంపై స్పందిస్తూ.. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని అన్నారు. బీహార్ బీజేపీ కోర్ గ్రూప్ నేతలు మంగళవారం పాట్నాలో సమావేశమ య్యారు. పార్టీ రాష్ట్ర చీఫ్ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌ లో.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఢిల్లీలో ఉన్న సుశీల్ మోడీ, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, అశ్వినీ చౌబే, కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తదితరులు పాట్నాకు వెళ్లారు. 

బీజేపీతోనే కొనసాగుతం: పరాస్

బీజేపీతోనే కొనసాగుతామని రాష్ట్రీయ లోక్‌‌ జనశక్తి పార్టీ నేత, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ చెప్పారు. ఎల్జేపీ ప్రస్తుత అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ మాత్రం.. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.