- విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా విడుదలయ్యే ఆనవాయితీకి బ్రేక్
- జిల్లాలకు చేరుతున్న పుస్తకాలు
- సర్కారు కాలేజీల స్టూడెంట్లకు జూన్ 1 కల్లా పంపిణీ
- 20 రకాల కొత్త టైటిల్స్
- బుక్స్‌లోనే మోడల్ క్వశ్చన్ పేపర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కొత్త సిలబస్ పుస్తకాల పంపిణీ ఎలాంటి హడావుడి లేకుండా మొదలైపోయింది. సాధారణంగా ఇంటర్ బోర్డు కొత్త పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు విద్యా శాఖ మంత్రి చేతుల మీదుగా ఘనంగా విడుదల చేయడం ఆనవాయితీ. కానీ, ఈసారి అలాంటి హడావుడి ఏమీ లేకుండానే పుస్తకాలు జిల్లాలకు చేరుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం, గతంలో పనిచేసిన అధికారిపై ఉన్న పట్టింపులతోనే అధికారిక విడుదల కార్యక్రమం లేకుండానే పుస్తకాలను పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్టేట్ వైడ్గా నిరుడు 3,349 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. ఈ ఏడాది మంగళవారం నాటికి వెయ్యి కాలేజీలు అఫిలియేషన్ పొందాయి. అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఐదేండ్లకోసారి సిలబస్ మారుస్తుంటారు. కానీ, సైన్స్ గ్రూపుల్లో చివరిసారిగా 2012లో, ఆర్ట్స్ గ్రూపుల్లో 2015 లో కొన్ని సబ్జెక్టులు, తర్వాత రెండేండ్లు మరికొన్ని సబ్జెక్టుల్లో సిలబస్ మారినట్టు లెక్చరర్లు చెప్తున్నారు. అయితే, ఈ అకాడమిక్ ఇయర్ లో మాత్రం మొత్తం అన్ని సబ్జెక్టులకు సిలబస్ మార్పు చేశారు. మొత్తం 20 రకాల సబ్జెక్టులకు సంబంధించిన ఫస్టియర్ కొత్త పుస్తకాలు సిద్ధమయ్యాయి.
ఈ పుస్తకాల్లోనే విద్యార్థుల కోసం మోడల్ క్వశ్చన్ పేపర్లను కూడా చేర్చారు. జూన్ 1న కాలేజీలు తెరిచే సమయానికి సర్కారు కాలేజీల విద్యార్థులకు ఇవి అందనున్నాయి. మూడు రోజుల నుంచి పుస్తకాలు జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. అయితే.. కన్నడ, మరాఠీ వంటి తక్కువ మంది విద్యార్థులు ఉండే ల్యాంగ్వేజ్ పుస్తకాలను మాత్రం ఇంకా ప్రింట్ చేయలేదు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా విడుదల కావాల్సిన పుస్తకాలు.. అధికారుల వైఖరితో ఇలా గుట్టుచప్పుడు కాకుండా తరలిపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రిలీజ్ లేకుండానే...
గత ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఈ కొత్త సిలబస్ తయారీలో, పుస్తకాల ప్రింటింగ్ విషయంలో కీలక పాత్ర పోషించారు. ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ ప్రమాణాలకు తగ్గట్టుగా, క్వాలిటీ పేపర్‌తో ఈ బుక్స్ ప్రింట్ చేయించారు. వీటిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా విడుదల చేయించాలని ఆయన భావించారు. అయితే, ఆయన బదిలీ కావడంతో సీన్ మారింది. ఆయన హయాంలో తయారైన బుక్స్ రిలీజ్ చేయడం ఎందుకనే రీతిలో కొందరు ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహించారన్న చర్చ ఇంటర్ వర్గాల్లో నడుస్తోంది.
ఇంటర్ లో కొత్త సిలబస్, ఇంటర్నల్స్ తో సహా కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కృష్ణ ఆదిత్యనే ప్రపోజల్స్ రెడీ చేశారు. ఆయన బదిలీ కావడంతో వాటిని పక్కన పెడ్తారనే ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులు నిర్లక్ష్యంపై వెలుగులో కథనం రావడంపై సర్కారు స్పందించి, వెంటనే అమలుకు ఆదేశాలచ్చింది. ఈ క్రమంలో కొత్త పుస్తకాలను తెలుగు అకాడమీ నుంచి జిల్లాల్లోని సర్కారు కాలేజీలకు తరలిస్తున్నారు.
