ఇంటర్లో కొత్త సిలబస్.. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రయోగాత్మక పరీక్షల అమలు

ఇంటర్లో కొత్త సిలబస్.. ఫస్ట్ ఇయర్ నుంచే ప్రయోగాత్మక పరీక్షల అమలు
  • ఈ ఏడాది నుంచే 20 ఇంటర్నల్ మార్కులు 
  • హైటెక్ హంగులతో కొత్త పుస్తకాలు.. జూన్ 1న విడుదల
  • స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ, ఇంటర్ బోర్డు 

ఇంటర్​ ఫస్టియర్​లో కొత్త సిలబస్ అమలు చేస్తున్నట్టు విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ప్రకటించాయి. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్​కు ఫస్టియర్​లోనూ ప్రాక్టికల్స్​ నిర్వహించనున్నారు. మ్యాథ్స్ థియరీ మార్కులను 75 నుంచి 60కి తగ్గించి, మిగిలిన 15 మార్కులను ఇంటర్నల్స్​కు కేటాయించారు.

హైదరాబాద్,వెలుగు:రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యారంగంలో చోటు చేసుకోబోయే మార్పులపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. వచ్చే విద్యాసంవత్సరం (2026–-27) నుంచి అమల్లోకి రానున్న కొత్త సిలబస్, పరీక్షా విధానం, ఇతర రీఫామ్స్ పై విద్యాశాఖ, ఇంటర్ బోర్డు స్పష్టత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ ఫస్టియర్ లో కొత్త సిలబస్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. గురువారం ‘ఇంటర్ సిలబస్​లో మార్పు ఉన్నట్టా లేనట్టా’ హెడ్డింగ్ తో వెలుగులో వార్త ప్రచురితమైంది. 

దీనిలో సిలబస్, కొత్త పుస్తకాలు, ఇంటర్నల్స్ తదితర అంశాలపై స్పష్టత కరువైందని పేర్కొన్నది.  దీనిపై విద్యాశాఖ అధికారులపై సీఎంఓ సీరియస్ అయినట్టు తెలిసింది. వెంటనే స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశించినట్టు సమాచారం. దీంతో వచ్చే కొత్త విద్యాసంవత్సరంలో అమలు చేసే రీఫామ్స్ పై వివరణ ఇచ్చారు. ఇక సైన్స్ స్టూడెంట్స్ కే కాకుండా.. అన్ని గ్రూపులకు ప్రాక్టికల్స్, ఇంటర్నల్ మార్కులు ఉంటాయని ప్రకటించారు. 

  • రెండేండ్లూ ప్రాక్టికల్స్.. 

ఇప్పటివరకు ఇంటర్ సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) విద్యార్థులకు సెకండియర్ లో మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఫస్ట్ ఇయర్ లో 15 మార్కులు, సెకండియర్ లో 15 మార్కుల చొప్పున ఏటా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను 60 మార్కులకు పరిమితం చేశారు. ఇక మ్యాథ్స్ (1ఏ, 1బీ) విద్యార్థులకు పెద్ద ఊరట లభించింది. థియరీ మార్కులను 75 నుంచి 60కి తగ్గించి, మిగిలిన 15 మార్కులను  ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’ (ఏబీఎల్)  కింద ఇంటర్నల్స్ కు కేటాయించారు.

  • ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లోనూ ఇంటర్నల్స్..

హ్యూమానిటీస్ (సీఈసీ, హెచ్​ఈసీ) తో పాటు తెలుగు, ఇంగ్లిష్ వంటి భాషా సబ్జెక్టులకు కూడా 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో వీటి థియరీ పరీక్షలు 100 నుంచి 80 మార్కులకు తగ్గనున్నాయి. ఎంఈసీ  విద్యార్థుల కోసం మ్యాథమెటిక్స్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక ప్రశ్నాపత్రాన్ని రూపొందించనున్నారు. దీంతో పాటు అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సమ్మేళనంతో ఏసీఈ’  పేరుతో సరికొత్త గ్రూపును తీసుకురాబోతున్నారు. 

  • క్వాలిటీ బుక్స్.. క్యూఆర్ కోడ్స్..

మారిన సిలబస్ కు అనుగుణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం ఆధునిక హంగులతో టెక్స్ట్ బుక్స్ ను బోర్డు రూపొందించింది. ఈ పుస్తకాల్లో సబ్జెక్టుకు సంబంధించిన క్లియర్ డయాగ్రమ్స్, అదనపు సమాచారం కోసం నాలెడ్జ్ బాక్సులు, క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌లు, సిమ్యులేషన్స్ వంటి ఫీచర్లను చేర్చారు. జూన్ 1 నాటికి ఈ పుస్తకాలు మార్కెట్లోకి వస్తాయని బోర్డు అధికారులు వెల్లడించారు.  ఇప్పటికే ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, విద్యార్థులు ఈ మార్పులను గమనించి గ్రూపులను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.