హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్హెచ్ఎం జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ములుగు క్యాంప్ ఆఫీసులో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ రావు పుట్ట నేతృత్వంలో మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలని కోరారు.
సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఎన్హెచ్ఎం సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని, వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు డాక్టర్ భరత్ కుమార్, రుక్ముద్దీన్, నరేశ్, ప్రణీత్ పాల్గొన్నారు.
