హైదరాబాద్, వెలుగు: నిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప శనివారం ఒక ప్రకటనలో కోరారు. లక్షలాది మంది పేదలకు వైద్య సేవలందిస్తున్న ఈ హాస్పిటల్ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కిడ్నీ ఆపరేషన్ చేయిస్తానని నమ్మబలికి ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒక పేషెంట్ వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు.
దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టి, సదరు ఉద్యోగి తప్పు చేసినట్లు తేలడంతో వెంటనే విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
