నితీశ్ ఎప్పుడైనా తిరిగి ఎన్డీఏలోకి రావొచ్చు : రామ్ దాస్ అథవాలే

నితీశ్ ఎప్పుడైనా తిరిగి ఎన్డీఏలోకి రావొచ్చు : రామ్ దాస్ అథవాలే
  • నితీశ్ ఎప్పుడైనా తిరిగి ఎన్డీఏలోకి రావొచ్చు :  కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే
  • కుదరదు.. తలుపులు మూసుకుపోయాయి: సుశీల్  మోదీ

ముంబై:  నిరుడు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న బిహార్  సీఎం నితీశ్  కుమార్  ఎప్పుడైనా తిరిగి ఎన్డీఏలోకి రావచ్చని కేంద్ర మంత్రి రామ్ దాస్  అథావాలే అన్నారు. ఆదివారం పీటీఐతో ఆయన మాట్లాడారు. నితీశ్  గతంలో ఎన్డీఏలో భాగమని గుర్తుచేశారు. బిహార్  అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్  పార్టీ జనతా దళ్  యునైటెడ్  కన్నా బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చినా నితీశ్ ను సీఎం చేశారని తెలిపారు. ఇక ప్రతిపక్షాల ఇండియా కూటమిపైనా అథవాలే విమర్శలు గుప్పించారు. తమ అజెండా దేశ అభివృద్ధి కాగా.. ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించడం ఒక్కటే ప్రతిపక్షాల కూటమి అజెండా అని ఆయన మండిపడ్డారు. 

ప్రధాని అభ్యర్థిత్వంపై ఇండియా కూటమిలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదని, అలాగే కూటమికి కన్వీనర్ గా ఎవరు ఉండాలన్నా అంశంపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో ముంబైలో జరిగే ఇండియా మీటింగ్ కు నితీశ్  వెళ్లకపోతే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాను ‘ఇంట్రడక్షన్  నెగెటివ్  డేట్  ఐడియా అలియెన్స్’ గా ఆయన ఎద్దేవా చేశారు. ఇక శివసేన ఉద్ధవ్  ఠాక్రే వర్గం, ఎన్సీపీ చీఫ్ శరద్  పవార్  వల్ల బెంగాల్ లో మమతా బెనర్జీకి ఎలాంటి ఉపయోగం లేదని, అలాగే మమత వల్ల కూడా ఆ రెండు పార్టీల నేతలకూ ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.

అథవాలేది వ్యక్తిగత అభిప్రాయం

ఎన్డీఏలోకి బిహార్  సీఎం నితీశ్  మళ్లీ రావచ్చని రామ్ దాస్  అథవాలే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుశీల్  మోదీ స్పందించారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. అథవాలే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. ఎన్డీఏలోకి మళ్లీ వచ్చేందుకు నితీశ్ కు అవకాశం లేదని, పార్టీ తలుపులను బంద్  చేశామని సుశీల్  స్పష్టం చేశారు. ‘‘నితీశ్  మాతో మళ్లీ చేరాలని కోరుకున్నా, అందుకు బీజేపీ సిద్ధంగా లేదు. అథవాలే బీజేపీ ప్రతినిధి కాదు, ఎన్డీఏ ప్రతినిధి కూడా కాదు. ఆయన ఓ పార్టీ (రిపబ్లికన్  పార్టీ ఆఫ్  ఇండియా) కి లీడర్. కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం”  అని సుశీల్  మోదీ చెప్పారు.