ఉక్రెయిన్, చైనా మెడికోలకు గుడ్ న్యూస్

ఉక్రెయిన్, చైనా మెడికోలకు గుడ్ న్యూస్

హైదరాబాద్, వెలుగు: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి, కరోనా ఎఫెక్టుతో చైనా నుంచి తిరిగి వచ్చిన మెడికోలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) గుడ్‌‌న్యూస్ చెప్పింది. అక్కడి నుంచి తిరిగొచ్చాక ఆన్‌‌లైన్‌‌లో క్లాసులు విని, ఎగ్జామ్స్ రాసి పాసైనోళ్లకు ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌లో జరగనున్న ఫారిన్‌‌ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్(ఎఫ్‌‌ఎంజీఈ) రాసేందుకు అనుమతిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 30లోగా ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్‌‌ పొంది ఉండాలని కండీషన్‌‌ పెట్టింది. ఎఫ్‌‌ఎంజీ ఎగ్జామ్‌‌ పాస్ అయితే, మన దేశంలోని ఏదైనా మెడికల్ కాలేజీలో రెండేండ్ల పాటు ఇంటర్న్‌‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌‌షిప్‌‌ పూర్తయ్యాకే డాక్టర్‌‌‌‌గా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశమిస్తారు. సాధారణంగా ఇంటర్న్‌‌షిప్‌‌ 9 నెలలు మాత్రమే ఉంటుంది. కానీ, ఉక్రెయిన్, చైనా నుంచి వచ్చిన మెడికోలకు క్లినికల్ ఎక్స్‌‌పీరియన్స్ లేనందున రెండేండ్ల ఇంటర్న్‌‌షిప్ నిబంధన పెడుతున్నట్టు ఎన్‌‌ఎంసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఇంకెవరికీ చాన్స్‌‌ ఇవ్వం

ఈ ఒక్కసారికే సడలింపు ఇస్తున్నామని, ఇంకెవరికీ భవిష్యత్తులో ఇలాంటి సడలింపు ఉండబోదని ఎన్‌‌ఎంసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడి మెడికల్ కాలేజీల్లో చదువుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఢిల్లీలోని మెడికోలు, వారి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిపై శుక్రవారం పార్లమెంటులోనూ చర్చ జరిగింది. ఉక్రెయిన్ నుంచి దాదాపు 20 వేల మంది మెడికోలు ఇండియాకు వచ్చారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లోక్‌‌సభలో వెల్లడించారు. ఇక్కడి కాలేజీల్లో వీళ్లను చేర్చుకునేందుకు ఎన్ఎంసీ పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. ఉక్రెయిన్‌‌, చైనాలోని మెడికల్ వర్సిటీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. చైనా త్వరలోనే మన స్టూడెంట్లకు వీసా ఇచ్చే చాన్స్​ ఉండడం, ఉక్రెయిన్‌‌లో యుద్ధ వాతావరణం తొలగిపోతే మళ్లీ స్టూడెంట్స్‌‌ వెళ్లేందుకు అవకాశం ఉండడంతో వీరికి మినహాయింపు ఇవ్వలేదని ఫారిన్‌‌ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు.