పెట్రోల్‌ బంకుల్లో క్రెడిట్‌ కార్డు పేమెంట్స్‌‌పై డిస్కౌంట్లు బంద్‌‌..

పెట్రోల్‌ బంకుల్లో క్రెడిట్‌ కార్డు పేమెంట్స్‌‌పై డిస్కౌంట్లు బంద్‌‌..

పెట్రోల్‌‌ బంకుల్లో క్రెడిట్‌‌కార్డ్‌‌ పేమెంట్స్‌‌పై ఇస్తున్న 0.75 శాతం డిస్కౌంట్‌‌ను అక్టోబర్‌‌ 1 నుంచి ఆపేస్తున్నారు. డిజిటల్‌‌ చెల్లింపులను పెంచేందుకు ఈ డిస్కౌంట్లను రెండేళ్ల కిందట ప్రభుత్వ రంగ ఆయిల్‌‌ కంపెనీలు మొదలు పెట్టాయి.  అక్టోబర్‌‌ 1 నుంచి 0.75 శాతం డిస్కౌంట్‌‌ను నిలిపివేయమని ఆయిల్‌‌ కంపెనీలు సిఫారసు చేయడంతో దానిని ఆపేస్తున్నట్లు చెబుతూ తన క్రెడిట్‌‌ కార్డ్‌‌ కస్టమర్లకు ఎస్‌‌బీఐ మెసేజ్‌‌లు పంపించింది. డీమానిటైజేషన్‌‌ నేపథ్యంలో లిక్విడిటీ కొరత అధిగమించడానికి  2016 లో పెట్రోల్‌‌ బంకుల్లో క్రెడిట్‌‌ కార్డు పేమెంట్స్‌‌పై 0.75 శాతం డిస్కౌంట్‌‌ ఇమ్మని ఐఓసీ, బీపీసీఎల్‌‌, హెచ్‌‌పీసీఎల్‌‌లను కేంద్ర ప్రభుత్వం కోరింది. క్రెడిట్‌‌, డెబిట్‌‌ కార్డుల చెల్లింపులు, ఈ–వాలెట్‌‌ చెల్లింపులకు వర్తింప చేసిన ఈ 0.75 శాతం డిస్కౌంట్‌‌ ఆయిల్‌‌ కంపెనీలకు భారంగా మారింది. నగదు డిస్కౌంట్లతోపాటు, కార్డు పేమెంట్‌‌ ఛార్జీల భారాన్ని కూడా భరించాలని ఆయిల్‌‌ మార్కెటింగ్‌‌ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. సాధారణంగా ఈ మర్చంట్‌‌ డిస్కౌంట్‌‌ రేట్‌‌ (ఎండీఆర్‌‌)ను రిటైలర్‌‌ భరిస్తాడు. అన్ని  క్రెడిట్‌‌  కార్డుల పేమెంట్స్‌‌పై డిస్కౌంట్‌‌ను అక్టోబర్‌‌ 1 నుంచి నిలిపివేయాలని ఆయిల్‌‌ మార్కెటింగ్‌‌ కంపెనీలు నిర్ణయించినట్లు  పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఐతే, డెబిట్‌‌ కార్డు, ఇతర డిజిటల్‌‌ చెల్లింపులపై డిస్కౌంట్లు యధాప్రకారం కొనసాగుతాయని పేర్కొన్నారు.