బూస్టర్ వ్యాక్సిన్ కు డిమాండ్ తగ్గిపోయింది: సీరమ్ సీఈవో

బూస్టర్ వ్యాక్సిన్ కు డిమాండ్ తగ్గిపోయింది: సీరమ్ సీఈవో

2021 డిసెంబర్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి నిలిపివేసినట్లు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా చెప్పారు. ఆ సమయంలో స్టాక్ లో ఉండి  గడువు ముగిసిన100 మిలియన్ డోసులను డంప్ చేశామని చెప్పారు. ప్రజలు కోవిడ్‌తో విసిగిపోయినట్లు కనిపించడంతో బూస్టర్ వ్యాక్సిన్ కు డిమాండ్ తగ్గిపోయిందని ఆయన తెలిపారు. DVMN వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా.. పూణెలో జరుగుతున్న మూడు రోజుల సదస్సులో పూనావాలా ఈ వ్యాఖ్యలు చేశారు.

SII అభివృద్ధి చేసిన కోవోవాక్స్ కు రెండు వారాల్లో అనుమతి ఇవ్వాలని పూనావాలా కోరారు. ఒమిక్రాన్ జాతులకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ లను అభివృద్ధి చేయడానికి SII చేస్తున్న ప్రయత్నాలపై ఆయన స్పందించారు. ఒమిక్రాన్ నిర్ధిష్ట బూస్టర్ లో యూఎస్ నోవావాక్స్ తో తాము భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. ఇది ద్విపద వ్యాక్సిన్ కానుందని చెప్పారు. కోవోవాక్స్, దాని సమర్థత కోసం సీరమ్ ఇన్ స్టిట్యూట్ ట్రయల్స్ ను నిర్వహించిందన్నారు.  రాబోయే 10  లేదా -15 రోజుల్లో బూస్టర్ షాట్ ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పారు. SII US సంస్థ కోడాజెనిక్స్‌తో కలిసి సింగిల్-డోస్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తోందని పూనావాలా తెలిపారు.