వడ్లు ఎవరూ కొంటలేరు

వడ్లు ఎవరూ కొంటలేరు
  • లారీలు లేక, గన్నీ బస్తాలు సాలక ఆగిన కొనుగోళ్లు
  • రోజుల తరబడి రైతుల పడిగాపులు..
  • చెడగొట్టు వానలతో ఆగమాగం
  • కొట్టుకుపోతున్న కుప్పలు..కాపాడుకునేందుకు రైతుల తిప్పలు
  • తాలు పేరుతో మిల్లర్ల దోపిడీ.. సాఫ్‌‌ చేసి తెచ్చినా కొర్రీలు

వెలుగు నెట్‌‌వర్క్/కరీంనగర్: కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నరు. లారీలు, తేమ కొలిచే మెషీన్లు లేక, గన్నీ బస్తాలు సాలక కొనుగోళ్లు ఆగిపోతున్నయి. దీంతో రోజుల తరబడి కేంద్రాల దగ్గరే రైతులు పడిగాపులు కాస్తున్నరు. కల్లాల్లోనే వడ్లు పోసుకొని, పరదాలకు కిరాయిలు కట్టుకుంటున్నరు. ఇదే టైమ్‌‌లో వానలు పడ్తుండటంతో వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు నానా కష్టాలు పడ్తున్నరు. అధికారులు గానీ, లీడర్లు గానీ ఇవేవీ పట్టించుకోవట్లేదని మండిపడ్తున్నరు. పలుకుబడి ఉన్నోళ్లకు అన్నీ సక్కగా సాగిపోతున్నయని ఆరోపిస్తున్నరు. వడ్లను సాఫ్‌‌ చేసి తీసుకొస్తున్నా తాలు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారని ఆవేదన చెందుతున్నరు. 
లారీలు వస్తలేవు.. బస్తాలు ఇస్తలేరు 
ఈ యేడు నీళ్లు ఉండటంతో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మంచి పంటలే పండాయి. రాష్ట్రంలో ఈ యాసంగిలో 6,400 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కోటి 32 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని సివిల్ సప్లై శాఖ నిర్ణయించింది. ఈ ప్రాసెస్‌‌ను 45 రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకుంది. కానీ 20 రోజులైనా కొనుగోళ్లలో మార్పులేం కనిపించట్లేదు. గతంలో మాదిరే కష్టాలు పడుతున్నమని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు చేస్తున్నా లారీలు దొరక్క కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లను ఆపేస్తున్నారు. లారీలు లేకపోవడంతో కామేపల్లి మండలంలో మంగళవారం నుంచి కొనుగోలు ఆపాలని ఆఫీసర్లు చెప్పారంటున్నారు. వనపర్తి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల లారీ లోడ్ వడ్లు కావట్లేదని కాంటాలు పెట్టట్లేదు. సూర్యాపేట జిల్లాలో కొన్ని చోట్ల 20 రోజులుగా లారీల్లేక ధాన్యాన్ని మిల్లులకు తరలించట్లేదు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి 
కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది 4.34 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 352 సెంటర్లకు 325 సెంటర్లలో కొనుగోళ్లు చేస్తున్నారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, తాలు పేరుతో ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో పారా బాయిల్డ్ రైస్ మిల్లులు 30 మాత్రమే ఉండటం సమస్యగా మారింది. చాలా కేంద్రాల్లో  తరుగు పేరుతో బస్తాకు 2 కిలోల ధాన్యం ఎక్కువ తూకం వేస్తున్నారు. లేకుంటే ట్రాక్ షీట్‌‌లో లోడ్‌‌కు 5 క్వింటాళ్ల వరకు తగ్గించి మిల్లర్లు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొంటున్నా లారీలు దొరక్క కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 28 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వర్షం పడుతుండటంతో కల్లాల్లోని ధాన్యం తడువకుండా ఉంచేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోనూ గన్నీల సమస్య వెంటాడుతోంది. యాదాద్రి జిల్లాలో మిల్లుకు వచ్చిన వడ్లను దించుకునే విషయంలో మిల్లర్లు తరుగు కొర్రీలు పెడుతున్నారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో కొనుగోలు లేటవుతుండటంతో రైతులు రాస్తారోకో చేశారు. మంచిర్యాల జిల్లాలో ట్రాన్స్‌‌పోర్టేషన్ లేటవుతోంది. లారీలు అన్‌‌లోడ్ కావడానికి రెండు మూడ్రోజుల టైమ్ పడుతోంది. చాలా సెంటర్లలో బ్యాగులు దొరకట్లేదు. లోకల్ లీడర్లు చెప్పిన వాళ్లకే ముందు బ్యాగులు ఇస్తున్నారు. 
పైసలు పెట్టి తరుగు తీసినా ఇబ్బంది పెడ్తున్నరు
రైతులు ఇబ్బంది పడొద్దని మార్కెట్ యార్డులతో పాటు ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్ ఊరికో ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు పెట్టారు. కానీ కేంద్రాలకు వెళ్లిన రైతులను పట్టించుకోకపోవడంతో వాళ్లు రోడ్డెక్కుతున్నారు. రైతులు గంటకు రూ. వెయ్యి పెట్టి ట్రాక్టర్ల ద్వారా మోటార్ ఫ్యాన్లతో వడ్లను శుభ్రపరుచుకుంటున్నారు. ఆర్థికంగా లేని వారు చాటలతో రోజంతా వడ్లను గాలికి పడుతూ శుభ్రం చేసుకుంటున్నారు. ఇంత చేసినా అన్ని కేంద్రాల్లో 2 నుంచి 3 కిలోలు తరుగు తీస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై నట్టేట ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. పైగా కాంటాలు వేసే దగ్గర, గన్నీ సంచులు ఇచ్చే చోట పలుకుబడి ఉన్నోళ్లకే ముందు ఇస్తున్నారని, మిగతా రైతులంతా రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే కావలి కాస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ఏ టైమ్‌‌లో వర్షం పడుతుందోనని భయమవుతోందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా కొనుగోలు కేంద్రాల్లో చిన్న పాటి వర్షాలకే వడ్ల కుప్పలు, రాశులు కొట్టుకుపోయాయని అంటున్నారు. 
10 రోజుల నుండి పడిగాపులు 
10 రోజుల క్రితం నకిరేకల్ మార్కెట్‌‌కు ధాన్యం తెచ్చి పోసిన. లారీలు రావట్లే దంటున్నరు. ఊరి నుంచి రోజూ వచ్చి పోతున్నం. అడుగుదామంటే ఆఫీసర్లు ఉండట్లే. సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. మా ఊర్లో ఐకేపీ సెంటర్ ఉన్నా ఇక్కడ తొందరగా కొంటరని తెచ్చి పోస్తే దిక్కే లేదు. ఇలా ఎన్ని రోజులు ఎదురు చూస్తూ కూర్చోవాలో అర్థం కావట్లేదు. -జడ ఉపేందర్, కేతేపల్లి, నల్గొండ