వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు

వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు

తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో కవులు, రచనలు ఎంతో కీలకం. ఈ అంశాలపై తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్వహించే పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతుంటారు. వీటిని ఒకటికి రెండు సార్లు చదవడం ద్వారా గుర్తు పెట్టుకొని మంచి స్కోర్​ను సాధించవచ్చు. ఈ నేపథ్యంలో శాతవాహనుల కాలం నుంచి రాచకొండ, దేవరకొండ వెలిమల వరకు ముఖ్యమైన కవులు, వారి రచనల గురించి తెలుసుకుందాం. 

గుణాఢ్యుడు

కుంతలశాతకర్ణి ఆస్థానంలోని సుప్రసిద్ధ కవి గుణాఢ్యుడు. బృహత్​కథను పైశాచీ ప్రాకృత భాషలో రచించాడు. పైశాచీ అనేది ఆనాటి సమాజంలో సామాన్యులు మాట్లాడే భాష. గుణాఢ్యుడు బృహత్​కథను తెలంగాణలోని కొండాపూర్​(సంగారెడ్డి)లో రచించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇందులో సుప్రసిద్ధ రాజు ఉదయనుడు, అతని కుమారుడు నరవాహనదత్తుల సాహస కృత్యాల వర్ణన ఉంది. గుణాఢ్యుడిని తెలంగాణలో మొదటి లిఖిత కవిగా పేర్కొంటారు. దీని ఆధారంగానే క్షేమేంద్రుడు బృహత్​కథా మంజరి, సోమదేవసూరి కథాసరిత్సాగరం అనే గ్రంథాలు రచించారు. బృహత్​కథను అనుసరించి ప్రజల భాష దేశీ పేరుతో ఉండేదని, అది తెలుగు భాష అని అర్థమవుతుంది. 

హాలుడు

శాతవాహన రాజుల్లో 17వ వాడైన హాలుడు (బిరుదు కవివత్సలుడు) ఆస్థానానికి వచ్చిన కవులు చెప్పిన 700 గాథలను కూర్చి గాథాసప్తశతిగా సంకలనం చేశాడు. దాదాపు 350 మంది తెలంగాణకు చెందిన వారి వివరాలు ఈ గ్రంథం అందించింది. ఈ గాథల్లో అమాయక గ్రామీణుల జీవితం, పల్లె ప్రజల సరస శృంగారం, జాతరలు, ప్రకృతి చిత్రీకరణ, పొలాలు, కష్టజీవుల జీవితాన్ని చాలా రమ్యంగా వర్ణించారు. గాథాసప్తశతిలో అద్దం, పొట్ట, అత్త, పాడి, పిల్ల, కంటి, కరణి, పత్తి మొదలైన దేశీ పదాలు ఉన్నాయి. హాలుడు ఇతర గ్రంథాలు లీలావతి కావ్యం, అభిదమన చింతామణి, దేశీనామమాల. 

శర్మవర్మ

కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్న కవి శర్మవర్మ. కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. కుంతల శాతకర్ణి కాతంత్ర వ్యాకరణం ఆధారంగా ఆరు నెలల్లో సంస్కృతం నేర్చుకున్నాడు. అందుకే కుంతల శాతకర్ణి కాలం నుంచి సంస్కృతం అభివృద్ధి చెందింది.

ఆచార్య నాగార్జునుడు

యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీనుడు ఆచార్య నాగార్జునుడు. ఈయన మహాయాన బౌద్ధానికి చెందినవారు. శ్రీపర్వతంలో విశాలమైన గ్రంథాలయాన్ని స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేశాడు. సంస్కృతంలో అనేక బౌద్ధమత గ్రంథాలు రచించాడు. అవి సుహృల్లేఖ, ప్రజ్ఙాపారమిత సూత్రం, మాధ్యమికకారిక, రత్నావళి మొదలైన 24 గ్రంథాలు రచించాడు. 

కుతూహలుడు

ఈయన మహారాష్ట్రీ ప్రాకృతంలో లీలావతి పరిణయం కావ్యాన్ని రచించాడు. 

వాత్స్యాయనుడు

కామసూత్రాలను రచించాడు. ఇందులో శాతవాహనుల కాలంనాటి కోళ్లు, గొర్రెల పందేల ప్రస్తావన, బొమ్మలకు పెళ్లిళ్లు చేసే ఆటలు ఉన్నాయి.

పంపకవి 

పంపకవి ఆదికావ్యం (ఆది పురాణం) పేరుతో మొదటి జైన తీర్థంకరుడైన వృషభనాథుని చరిత్రను రచించాడు. రెండో అరికేసరి ఆస్థాన కవి అయిన పంపడు అరికేసరిని కీర్తిస్తూ విక్రమార్జున విజయం రచించాడు. రెండో అరికేసరి పంపకవికి ప్రసిద్ధ ధర్మక్షేత్రం ధర్మపురిని అగ్రహారంగా దానం చేశాడు. పంపడు జినేంద్రపురాన్ని తెలుగులో రచించాడు.

భీమన

వేములవాడ కవికి చెందిన భీమకవి బహుగ్రంథ కర్త. ఈయన శ్రీనాథుని లాగే సంచార కవి. నన్నయ్యకు పూర్వుడని చెప్పవచ్చు. భీమ కవి రాసిన రాఘవ పాండవీయం అనే ద్వర్థికావ్యాన్ని నన్నయ్య నాశనం చేయించాడని కథ వ్యాప్తిలో ఉంది. ఈయన కవి జనాశ్రయాన్ని మల్లియరేచన ఆశ్రయంలో రచించాడనే వాదన కూడా ఉంది. తెలుగులో రచించిన కవి జనాశ్రయం భీమన ఛందము పేరుతో ప్రసిద్ధమైంది. నృసింహపురాణం ఇతని మరో రచన. నన్నెచోడుడు కుమారసంభవం రచించాడు. 

సోమదేవ సూరి

సోమదేవ సూరి బిరుదు శాద్వాదచలసింహ. యశస్తిలకచంపు అనే కథా కావ్యాన్ని, సంస్కృతంలో నీతికావ్యమనే రాజనీతి గ్రంథం, కథా సరిత్సాగరం అనే మరో గ్రంథం రచించాడు. సోమదేవసూరి రెండో బద్దెనకు విద్యాగురువు. రెండో బద్దెన వేములవాడలో సోమదేవసూరికి శుభదామమనే జీనాలయాన్ని నిర్మించి ఇచ్చాడు. వేములవాడ శాసనం ద్వారా ఈ విషయం తెలుస్తుంది. 

బద్దెన 

ఈయన బిరుదు కమలాసనుడు. ఈయన రచనలు నీతి శాస్త్రముక్తావళి(రాజనీతి గ్రంథం), సుమతీ శతకం, దశదివాభరణాంక కర్త. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. 

విశ్వేశ్వర దేశకుడు

కాకతీయ గణపతి దేవుని దీక్షా గురువు విశ్వేశ్వర దేశకుడు. గణపతి దేవుని నుంచి మందరం అనే గ్రామాన్ని, రుద్రమదేవి నుంచి వెలగపూడి అనే గ్రామాన్ని పొందాడు. ఈ రెండు గ్రామాలను కలిపి గోళగి అనే అగ్రహారంగా మార్చి అక్కడ శివాలయం ప్రసూతి వైద్యశాల నిర్మించాడు. 

శివదేవయ్య 

పురుషార్థసారం, శివదేవధీమణిశతకర అనే గ్రంథాలు రచించాడు. ఇతన్ని సంస్కృతాంధ్ర కవి పితామహుడు అంటారు. గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుని వద్ద మంత్రిగా పనిచేశాడు. 

ఈశ్వర భట్టోపాధ్యాయుడు

ఈయన బూదపుర శాసన నిర్మాత. ఈ శాసనం మహబూబ్​నగర్లో ఉంది. ఈ శాసనంలో చిత్ర కవిత కనిపిస్తుంది.

కుప్పాంభిక

ఈమె గోన బుద్ధారెడ్డి కూతురు. బూదపురం శాసనం వేయించింది. ఈమెను తొలి తెలుగు తెలంగాణ కవయిత్రిగా పేర్కొంటారు. 

మడికి సింగన 

ఈయన రచనలు సకలనీతి సమ్మతం, పద్మపురాణోత్తర ఖండం, భాగవత దశమ స్కందం (ద్విపదం), జ్ఞాన వాశిష్ట రామాయణం(దీన్ని అహోబిల నరసింహాస్వామికి అంకితమిచ్చాడు). రామగిరిదుర్గ నివాసి అయిన ఈయన తొలి తెలుగు సంకలన గ్రంథాన్ని రచించారు. 

సర్వజ్ఞ సింగభూపాలుడు

ఈయన రచనలు రసావర్ణ సుధాకరం, సంగీత సుధాకరం, కందర్వసంభవం, కువలయావళి(రత్నపాంచాలిక).

గౌరన

రాచకొండ వాస్తవ్యుడైన గౌరన నవనాథ చరిత్ర (దీన్ని శ్రీగిరి పండితుడు గౌరన ముందే చంపువుగా రాశాడు), లక్ష్మణ దీపిక, హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాలు రాశారు. గౌరన తన కావ్యాలను శ్రీశైల మల్లికార్జునునికి అంకితం ఇచ్చాడు. 

బమ్మెర పోతన: ఈయన స్వస్థలం వరంగల్​ జిల్లాలోని పాలకుర్తి మండల పరిధిలోని బమ్మెర గ్రామం. పూర్వం ఈ గ్రామం నల్లగొండ జిల్లాలో ఉండేది. ఈయన బిరుదులు సహజ పండితుడు, నిగర్వ చూడామణి. పోతన కొంతకాలం మూడో సింగభూపాలుని ఆస్థానంలో ఉన్నాడు. ఈయన రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, మహా భాగవతం (తెలుగు), నారాయణ శతకం(అలభ్యం). తన రచనలను మానవులకు అంకితం చేయనని ప్రతిజ్ఞ చేసిన తొలి తెలుగు కవి పోతన. భాగవతాన్ని తన ఇష్టదైవమైన శ్రీరామునికి అంకితం చేశాడు. శ్రీనాథుడు సమకాలికుల్లో అగ్రగణ్యుడు. తొలి విప్లవ కవి. 

పాల్కురికి సోమనాథుడు

వరంగల్​ జిల్లా జనగామ దగ్గరలోని పాలకుర్తి ఈయన జన్మస్థలం. ఈయన బిరుదులు ప్రథమాంధ్ర విప్లవ కవి, దేశీ కవితోద్యమ పితామహుడు. పాల్కురికి సోమన తెలంగాణ తెలుగు సాహిత్యంలో ఆదికవి. తెలుగులో తొలిసారిగా జీవిత చరిత్ర రాసింది కూడా పాల్కూరికి సోమనాథుడు అనే చరిత్రకారుల అభిప్రాయం. 
తెలుగు రచనలు:  
బసవ పురాణం (తొలి సాంఘిక కావ్యం), పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, చతుర్వేద సారం, బసవోదాహరణం, బసవ రగడ, శ్రీ బసవాఢ్య రగడ, గంగోత్పత్తి రగడ, చెన్నమల్లు సీసములు, పండితారాధ్యోపహరణం, అనుభవసారం (తొలికృతి), సహస్రగణమాలిక.
సంస్కృత రచనలు: 
సోమనాథ భాష్యం, వృషభాష్టకం, రుద్ర భాష్యం, త్రివిధ లింగాష్టకం, బసవోదాహరణం.
కన్నడ రచనలు: 
బసవలింగ నామావళి, సద్గురు రగడ, శీల సంపాదన, కుమ్మరి గుండయ్య కథ, బెజ్జమహాదేవి, మాడేలు మాచెయ్య కథ, మాదరి చెన్నయ్య కథ, కన్నడ బ్రహ్మయ్య కథ, పిట్టవ్వ కథ, శివగణ సహస్రనామాలు.