ఆరు గ్యారంటీలపై వైట్​పేపర్​ రిలీజ్​చేయాలి: హరీశ్​రావు

ఆరు గ్యారంటీలపై వైట్​పేపర్​ రిలీజ్​చేయాలి: హరీశ్​రావు

సిద్దిపేట/చందుర్తి/భీమదేవరపల్లి, వెలుగు: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీతో పచ్చి అబద్ధాలు చెప్పించారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌‌‌‌ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌‌కుమార్‌‌ కు మద్దతుగా ఆదివారం రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామ శివారులో నిర్వహించిన ప్రచారం సభతో పాటు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో రోడ్​షోలో హరీశ్​పాల్గొన్నారు. 

అలాగే, సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరైతే.. అవే అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ రాంగ్ గాంధీ అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేశామని, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని రాహుల్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాహుల్, రేవంత్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు  తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి.. ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్లో 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్తే.. ఇప్పుడు రాహుల్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్పి దొందు దొందేనన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

బస్సు తప్ప అంతా తుస్సే

ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక్క గ్యారంటీనే అమలు చేసిందని హరీశ్​రావు అన్నారు. బస్సు తప్ప అంతా తుస్సేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆరు గ్యారంటీల అమలుపై వైట్​పేపర్ విడుదల చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చాలని ప్రతిపక్షాలు అడిగితే.. సీఎం రేవంత్ రెడ్డి తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని, లేదంటే  దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని విమర్శించారు. రేవంత్​ రెడ్డీవన్నీ జూటా మాటలని మండిపడ్డారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం మొత్తం రివర్స్​ గేర్​ లో నడుస్తోందని, కేసీఆర్​ పదేండ్లు సీఎంగా ఉన్న సమయంలో 24 గంటలు కరెంట్ ఇచ్చినా మోటార్లు కాలలేదని, కానీ కాంగ్రెస్​ వచ్చిన ఐదు నెలల్లోనే కరెంట్​కోతలతో పాటు మోటార్లు కాలిపోతున్నాయన్నారు. ముల్కనూరుకు చెందిన ప్రవీణ్​ రెడ్డికి ఎంపీ టికెట్​ఇస్తామని ఇచ్చిన గ్యారంటీనే అమలు చేయని కాంగ్రెస్​.. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ పార్టీ ముల్కనూరుకు చెందిన సుధీర్​ కుమార్ కు వరంగల్ ఎంపీ టికెట్​ఇచ్చి గౌరవిస్తే.. కాంగ్రెస్​ మొండిచేయి చూపెట్టి ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని హరీశ్​రావు విమర్శించారు.  

పేద ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదు 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో కార్పొరేట్ కంపెనీలకు తప్ప పేదలకు చేసిందేమీ లేదని హరీశ్​రావు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే తెలంగాణ మళ్లీ ఎన్కకు పోతదని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో ఓట్లేస్తే.. ఒక్క రూపాయి పని కూడా కాలేదన్నారు. రైతుకు పైసా పని చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. అక్షింతలు, క్యాలండర్లు, చిత్రపటాలు పంచితే అవి ప్రజల కడుపు నింపుతాయా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిందే బీఆర్​ఎస్​ పార్టీ అని, ఆ పార్టే  తెలంగాణకు శ్రీరామ రక్ష అని హరీశ్​అన్నారు.