- ఆదివాసీల ఇండ్ల స్థానంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, ఏసీ గదులు
- అమ్మవార్ల గద్దెల చుట్టూ పెరుగుతున్న భవనాలు
- తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు
వరంగల్ (మేడారం), వెలుగు : గతంలో దట్టమైన అటవీ ప్రాంతం, ఆదివాసీ గుడిసెలు, కోయల జీవన శైలితో కనిపించిన మేడారం.. ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఏసీ కిరాయి రూములతో నిండిపోయింది. కొన్నేండ్ల కింద మహాజాతర జరిగే నాలుగు రోజుల్లోనే భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకునేవారు.
కానీ ఇప్పుడు వీకెండ్స్‌తో పాటు పండుగ సెలవులు వచ్చినా, పచ్చటి ప్రకృతిలో సేద తీరాలన్నా.. మేడారానికే క్యూ కడుతున్నారు. మరో వైపు మహాజాతర టైంలో కోట్లాది మందితో మేడారం కిక్కిరిసిపోతుండడంతో చాలా మంది తమకు వీలైన రోజుల్లో వచ్చి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒకప్పుడు నాలుగు రోజుల పాటే భక్తులతో నిండిపోయే మేడారం.. ఇప్పుడు 365 రోజులూ కిటకిటలాడుతోంది. దీంతో స్థానికులు సైతం పర్మినెంట్ బిల్డింగ్‌లు నిర్మిస్తూ, గదులను అద్దెకు ఇస్తూ ఉపాధి పొందుతున్నారు.
కనిపించని కోయల ఆనవాళ్లు
రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుండగా.. 2010, 12 నాటికి మేడారం గద్దెల ప్రాంగణం చుట్టూ ఆదివాసీ జీవనశైలి కనిపించేది. గడ్డి, తాటాకుల గుడిసెలు, ఇంటి ముందర ఆవుపేడతో అలుకుచల్లి, ముగ్గులు వేసిన దృశ్యాలు కనిపించేవి. కోయలు నిత్యం ఉపయోగించే పనిముట్లు, వేటకత్తులు మట్టి గోడలకు వేలాడుతూ ఉండేవి.
ఇంటిచుట్టూరా వెదురు కర్రలతో ప్రహరీ, లోపల నాటు కోళ్లు, మేకలు, ఆవులు కనిపించేవి. అప్పట్లో కరెంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సాయంత్రమైతే కిరోసిన్ లాంతర్లు వెలిగేవి. 2016, 18 జాతరల నాటికి అడపాదడపా కోయల జీవన విధానం కనిపించినా.. ఇప్పుడు ఆ ఆనవాళ్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు.
పర్మినెంట్ హోటళ్లు, ఏసీ గదులు
మేడారం గతంలో కనిపించిన ఆదివాసీ ఇండ్ల స్థానంలో, మెయిన్ రోడ్ల వెంట ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్‌లు వెలిశాయి. జాతర లేని రోజుల్లో సైతం ఎక్కడ చూసినా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లే కనిపిస్తున్నాయి. షాపుల వెనుకాల వరుసగా గదులు కట్టి.. ఏసీ, నాన్ ఏసీ పేరుతో కిరాయికి ఇస్తున్నారు.
భక్తుల సంఖ్య పెరగడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారు. మేడారంలో అధికారిక లిక్కర్ షాపులు లేకున్నా.. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. హోటళ్లు, కూల్‌డ్రింక్ షాపులు, కిరాణం, కొబ్బరికాయల దుకాణాల్లో సైతం లిక్కర్ దొరుకుతోంది.
గద్దెల చుట్టూరా బిల్డింగులే...
మేడారం సమక్క సారలమ్మ జాతర అంటేనే వన జాతరగా చెబుతుంటారు. కానీ.. జాతర జరిగే ప్రధాన ప్రాంతమైన అమ్మవార్ల గద్దెల చుట్టూరా బిల్డింగ్‌లు నిర్మించడంతో ఈ ప్రాంతం సహజత్వం కోల్పోతోంది. అమ్మవార్ల గద్దెలను ఆనుకునే మూడు అంతస్తుల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించారు. జంపన్నవాగు వైపు టీటీడీకు సంబంధించిన మూడు అంతస్తుల బిల్డింగ్ ఉండగా.. దానికి ఎదురుగా ఐటీడీఏ గెస్ట్‌హౌస్ కట్టారు.
ఇక తల్లులను దర్శించుకుని బయటకు వెళ్లే దారిలో రెండు వైపులా దేవాదాయ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల బిల్డింగ్‌లు ఉన్నాయి. పర్యాటకుల కోసం హరిత హోటళ్లు కట్టామని చెబుతున్నా.. వాటిని ఏనాడూ సామాన్య భక్తులకు ఇవ్వట్లేదు. పర్మినెంట్, టెంపరరీ టెంట్లతో కలిసి 40 నుంచి 45 వరకు ఏసీ సర్వీస్ రూంలు ఉన్నా.. అవన్నీ మంత్రులు, లీడర్లు వారి అనుచరులు, ఆఫీసర్లు ఉండేందుకే కట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తిరుపతి తరహాలో అభివృద్ధికి సర్కార్ నిర్ణయం
మేడారం జాతరకు రెగ్యులర్ భక్తుల తాకిడి పెరిగింది. రెండేండ్లకోసారి మహాజాతర, ఏడాదికోసారి జరిగే మినీ జాతరతో సంబంధం లేకుండా నిత్యం భక్తులు తరలివస్తున్నారు. దీంతో తిరుపతి తరహాలో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వందల కోట్లతో టూరిజం, ఎండోమెంట్ బిల్డింగ్‌లు నిర్మించింది.
నాలుగు లేన్లలో సిమెంట్ రోడ్లు వేయడంతో పాటు హరిత కాకతీయ వంటి ప్రభుత్వ హోటల్స్‌ను డెవలప్ చేస్తున్నారు. మేడారం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేలా సుమారు 30 ఎకరాల స్థలంలో కాటేజీలు నిర్మించాలని భావిస్తున్నారు. జంపన్నవాగును జీవనదిగా మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
కిటకిటలాడిన మేడారం
తాడ్వాయి, వెలుగు : సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు మరో రెండు రోజులే ఉండడం, వరుస సెలవులు రావడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులతో ప్రధాన కూడళ్లు, జంపన్న వాగు స్నానఘట్టాలు, అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, కల్యాణకట్ట, బస్టాండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి.
మేడారం వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసిన అనంతరం ఎత్తు బంగారం, చీర, సారెతో అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సుమారు ఐదు లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.
