కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని,18 ఏండ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్నుంచి బాలుర జూనియర్ కాలేజీ గ్రౌండ్వరకు జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. అధికారులు, ఓటర్లతో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. 85 సంవత్సరాల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ సిటిజన్స్ను సన్మానించారు.
ఓటరు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్, డీఈవో విజయ, డీఏవో దేవ్ కుమార్, ఆర్డీవో రమాదేవి, డీఎస్వో రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఐసీ మాధవి, డీపీఆర్వో రాంచంద్రరాజు, తహసీల్దార్లులక్ష్మణ్ బాబు, గఫార్ పాల్గొన్నారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి
సంగారెడ్డి: ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు హక్కు వినియోగం కీలకమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు, ఓటు వినియోగం ఎంతో కీలకమన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం కేవలం 50 నుంచి 60 శాతం మాత్రమే ఉందని, అర్బన్ ఓటర్లలో ఓటు హక్కు వినియోగంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఓటరు ఐడీ కార్డులు అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన బూత్ లెవల్ అధికారులను సర్టిఫికెట్లతో సన్మానించారు. అడిషనల్ కలెక్టర్ పాండు, డీఆర్డీఓ జ్యోతి, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, అఖిలేశ్ రెడ్డి, రామాచారి, జగదీశ్, ఆర్డీవో రాజేందర్, డీఎం హెచ్‌వో వసంత్ రావు, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉత్తమ ఎన్నికల అధికారిగా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్: ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఎన్నికల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు ను అందుకున్నారు. ఆమెతో పాటుగా దుబ్బాక నియోజకవర్గ ఉత్తమ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా గరిమ అగ్రవాల్, ఉత్తమ బీఎల్ఓగా పుష్పలత అవార్డులను అందుకున్నారు.
ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు మిరుదొడ్డి మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన కుర్ర రేణుకకు ఆహ్వానం అందింది. స్వయం సహాయక సంఘం ద్వారా రుణం తీసుకొని ఒక చిన్న ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్న రేణుకకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
