హైదరాబాద్: చైనా మాంజా హైదరాబాద్లో ఒక బాలికను పొట్టనపెట్టుకుంది. తండ్రితో కలిసి బైక్పై వెళుతుండగా గొంతుకు చైనా మాంజా చిక్కుకుని బాలిక ప్రాణాలు కోల్పోయింది. తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వివేకానంద నగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
పాప ఒక్కసారిగా అరవడంతో ఆపి చూడగా గొంతుకు మాంజా చిక్కుకున్నట్లు తండ్రి గుర్తించాడు. తీవ్ర రక్తస్రావంతో కూతురు కొట్టుమిట్టాడుతుండటంతో బాలిక తండ్రి ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించాడు. అయితే.. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంక్రాంతి టైంలో కొందరు యువకులు, పిల్లలు సరదాగా ఎగురవేసే పతంగులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పతంగులు ఎగురవేయడానికి కొందరు వ్యక్తులు సాధారణ దారాలు కాకుండా గట్టిగా ఉండే మాంజాలు వాడుతున్నారు. ఈ మాంజాల కారణంగా బైక్‌పై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందులో ఒకరిద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి మాంజాను తయారు చేస్తారు. మామూలు కాటన్ దారంతో పోలిస్తే ఈ మాంజా దారం గట్టిగా ఉంటుంది. దీని వల్ల పతంగులు ఎగురవేసే టైంలో ఇతరుల కైట్స్ దారాలను తెంపడం ఈజీ అవుతుంది. దీంతో పతంగులు ఎగురవేసేందుకు మాంజాను వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే పతంగి తెగిన తర్వాత దానికి ఉన్న మాంజా గాలిలో తేలుతూ బైక్‌పై వెళ్లే వారికి గొంతుకు చుట్టుకుంటోంది. దీని కారణంగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడుతున్నారు. కొందరైతే ప్రాణాలే కోల్పోతున్నారు.
