హైదరాబాద్: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి బైక్పై వెళుతున్న చిన్నారి నిష్విక దరియా(5) గొంతుకు చైనా మాంజా కోసుకొని అక్కడికక్కడే మృతి చెందింది. KPHB గోకుల్ ఫ్లాట్స్లో నివాసముండే రామసాగర్ దంపతులు పఠాన్ చెరువు సమీపంలోని ఖాజీపల్లి గ్రామంలో వారు ఇటీవల తీసుకున్న ఇంటి దగ్గర జరుగుతున్న ఇంటీరియర్ పనులు చూసుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
KPHB కాలనీలోని ఓ నగల దుకాణానికి వెళ్దామని అనుకొని ఇంటికి వెళ్లకుండా మెయిన్ రోడ్ వైపు వెళ్లారు. యూటర్న్ తీసుకొని వెళ్దామనుకొని వస్తుండగా పాప గొంతుకు చైనా మాంజా చిక్కుకుంది. గొంతుకు మాంజా చుట్టుకోవడంతో పాప ఒక్కసారిగా బిగ్గరగా అరవడంతో తండ్రి గమనించి చూసేసరికి తీవ్ర రక్తస్రావం అయింది. సమీప ఆసుపత్రికి తీసుకొని రాగానే పాపను చూసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సంక్రాంతి టైంలో కొందరు యువకులు, పిల్లలు సరదాగా ఎగురవేసే పతంగులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పతంగులు ఎగురవేయడానికి కొందరు వ్యక్తులు సాధారణ దారాలు కాకుండా గట్టిగా ఉండే మాంజాలు వాడుతున్నారు. ఈ మాంజాల కారణంగా బైక్‌పై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందులో ఒకరిద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి మాంజాను తయారు చేస్తారు. మామూలు కాటన్ దారంతో పోలిస్తే ఈ మాంజా దారం గట్టిగా ఉంటుంది. దీని వల్ల పతంగులు ఎగురవేసే టైంలో ఇతరుల కైట్స్ దారాలను తెంపడం ఈజీ అవుతుంది. దీంతో పతంగులు ఎగురవేసేందుకు మాంజాను వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే పతంగి తెగిన తర్వాత దానికి ఉన్న మాంజా గాలిలో తేలుతూ బైక్‌పై వెళ్లే వారికి గొంతుకు చుట్టుకుని ప్రాణాలు తీస్తుండటం గమనార్హం. హైదరాబాద్ సిటీలో ఈ సంక్రాంతి సమయంలో మాంజా చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఘటనలు, చనిపోయిన ఘటనలు ఆందోళన కలిగించాయి.
