రిజర్వేషన్లలో రాజకీయ జోక్యం లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

రిజర్వేషన్లలో రాజకీయ జోక్యం లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్
  •     ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధం లేదు
  •     మంత్రి పొన్నం ప్రభాకర్ 

హుస్నాబాద్, వెలుగు: మున్సిపల్ రిజర్వేషన్లలో రాజకీయ జోక్యం ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్​లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..121 మున్సిపాలిటీల్లోని వార్డు రిజర్వేషన్లకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

అధికారులే పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. గత సర్కార్ తమకు నచ్చినట్టు రిజర్వేషన్లు మార్చుకుందని అందుకే ఇప్పుడు కొందరు ఆందోళన చెందుతున్నారని కానీ ఈసారి అంతా ఓపెన్ గా, రూల్స్ ప్రకారమే జరుగుతుంది అని మంత్రి తేల్చి చెప్పారు. గత ఎమ్మెల్యే హుస్నాబాద్‌‌ను సిద్దిపేటలో కలిపినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం హుస్నాబాద్‌‌ను కచ్చితంగా కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ప్రకటించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కి సంబంధించి 3090 ఎకరాలకు ఇప్పటికే 3070 ఎకరాలకు పేమెంట్లు పూర్తి చేశామని త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని, తాము అధికారంలోకి రాగానే 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, రాయికల్ వాటర్ ఫాల్స్, మహా సముద్రం గండి వంటి ప్రాంతాలను టూరిజం హబ్‌‌గా మారుస్తున్నామన్నారు. హుస్నాబాద్‌‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి 20 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని వెల్లడించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి 6 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. అంతకుముందు హుస్నాబాద్ పట్టణంలో కందుల కొనుగోలు కేంద్రంతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లోజిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, ఏ.ఎం.సి.చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ చందు, ఆయా శాఖల అధికారులు, నాయకులు రవి, శివయ్య, పద్మ, హాసన్, శ్రీనివాస్, రమణ, రజిత, తదితరులున్నారు. 

పద్మ శ్రీ విజేతలకు పొన్నం అభినందనలు

పద్మ శ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్​కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలు ఎందరికో పునర్జన్మను ఇచ్చాయని కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్.. వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, విజయానంద్ రెడ్డిల సేవలను ప్రశంసించారు.

కళారంగం నుంచి దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్​లు తమ ప్రతిభతో తెలుగు కళా వైభవాన్ని ప్రపంచానికి చాటారన్నారు. పశుసంవర్ధక రంగంలో మామిడి రామారెడ్డి చేసిన కృషి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని గుర్తు చేశారు.