నోముల నర్సింహం-కొమ్రెల్లి మల్లన్నకోరమీసం

నోముల నర్సింహం-కొమ్రెల్లి మల్లన్నకోరమీసం

కామ్రేడ్​ నోముల నర్సింహయ్య. ఈ పేరు తెలుగు నేలన ఒక దశాబ్దం పాటు మారుమోగింది. 1999 నుంచి 2009 వరకు రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్​ ప్రభుత్వాల పాలన ఉండగా నోముల నర్సింహయ్య సీపీఐ(ఎం) శాసనసభాపక్ష నాయకునిగా ఒక వెలుగు వెలిగారు. ప్రజాస్వామ్యంలో ‘ప్రతిపక్షం’ పాత్ర ఏమిటో, ప్రతిపక్షం ఎలా ఉండాలో, ప్రభుత్వాలకు వణుకు పుట్టించడంలో ప్రతిపక్షం వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో నిరూపించిన ఉత్తమ శాసనసభా పక్ష నాయకుడాయన.

అసెంబ్లీలో నోముల మాట్లాడుతున్నాడంటే మొదట ఒక సామెతతో అది కూడా పేదల దుస్థితి నో, ప్రభుత్వ దమన నీతినో వ్యక్తపరిచే విధంగా ఎంతో చమత్కారంతో ప్రాంభమయ్యేది. టీవీల్లో చూస్తున్న జనాలను ఆ ధోరణి, ఆ విశ్లేషణ ఎంతో ఆకట్టుకునేది ప్రత్యేకమైన ఆసక్తి పుట్టించేది. ఉదాహరణకు: ‘దూడను దగ్గరగా కట్టేసి, మేత దూరంగా వేసినట్టు’. ఇది సామాన్య, గ్రామీణ ప్రజానీకాన్ని భలేగా ఆకర్షించేది. నోముల నర్సింహయ్య మంచి మాటకారి. విషయ సేకరణతో పాటు, విషయాన్ని జనానికి చేరే భాషలో ప్రసంగించేవారు. పేద ప్రజల పక్షాన ఆయన శాసనసభలో వీరోచితంగా పోరాడేవారు.

అలాంటి నాయకులు నేటి సమాజానికి అవసరం

నర్సింహయ్యది నోముల పక్కన ‘పాలెం’ గ్రామం. నాది నోముల పక్కనే గుడివాడ గ్రామం. ఆయన చదువుకున్న హైస్కూల్..​ నేను చదువుకున్న హైస్కూల్ ఒక్కటే, నోముల హైస్కూల్. మొదట చిన్న ఉపన్యాసంతో పరిచయమయ్యాను విద్యార్థి దశలో. తర్వాత చాలా దగ్గరగా చర్చ చేసేంత సాన్నిహిత్యం పెరిగింది. పత్రికల్లో నా వ్యాసాలు చదివి ఫోన్ చేసి చర్చించేవాడు. జీవితంలో మెజారిటీ సమయాన్ని పేదల పక్షాన పోరాడటానికే వినియోగించిన ప్రజల మనిషి ఆయన. ఒకసారి నకిరేకల్​లో ఎస్సీ హాస్టల్ లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరిగిన సభలో కొన్ని పురాణ పాత్రల గురించి నేను ఉపన్యసించినప్పుడు ఎంత సంబరపడిపోయాడో చెప్పలేను. పాండవులు, శ్రీకృష్ణుని కులం పేరుతో అభిశంసించడాన్ని పద్యాలతో సహా చెప్పినప్పుడు ఆయన కళ్లలో బాధను చూశాను. వికలాంగుల సభ నిర్వహించి నేను ఆడిపాడినప్పుడు ఆయన మెచ్చుకున్న తీరు ఈ రోజు గుర్తొస్తే చెప్పలేని బాధయ్యింది. నిరాడంబరుడైన అలాంటి నాయకులు నేటి సమాజానికి ఎంతో అవసరం.

ఎంపీపీగా, ఎమ్మెల్యేగా సేవలు

64 సంవత్సరాలు జీవించిన నోముల నర్సింహయ్య రెండుసార్లు నకిరేకల్ ఎంపీపీగా, ఆ తర్వాత నర్రా రాఘవ రెడ్డి సుదీర్ఘ నకిరేకల్ శాసన సభ ప్రాతినిధ్యం తర్వాత 1999–2009 వరకు రెండు పర్యాయాలు నోముల ఎమ్మెల్యేగా, సీపీఎం పార్టీ శాసనసభా పక్షనేతగా విస్తృతమైన సేవలందించారు. పాలెం గ్రామంలో ప్రాథమిక విద్య, నోముల గ్రామంలో హైస్కూలు విద్య, నల్గొండలో ఇంటర్, డిగ్రీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, ఎల్ఎల్​బీ పూర్తి చేశారు. కొంత కాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేసినట్లు నాకు గుర్తు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యనభ్యసించి, తుది శ్వాస విడిచే వరకు ప్రజల పక్షాన పోరాడిన యోధుడు నోముల నర్సింహయ్య. 2014లో నాగార్జునసాగర్​ అసెంబ్లీ సెగ్మెంట్​ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నోముల, 2018లో జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పదవి ఉన్నా లేకపోయినా పేదల సమస్యలే ప్రాధాన్యంగా పనిచేసే కొద్ది మంది నాయకుల్లో నోముల నర్సింహయ్య ఒకరు.

విలువలు పెంచేందుకు శ్రమించారు

కాంగ్రెస్​ సర్కార్లతో పాటు మిత్రపక్షమైన చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన రైతు వ్యతిరేక విధానాలను నిశితంగా విమర్శించి ప్రజల్ని చైతన్యం చేశారు. రైతులు, రైతు కూలీల ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని మార్క్సిస్టు గొంతుగా మారిపోయారు. అటు శాసనసభలో, ఇటు సమాజంలో మానవ విలువలు పెంపొందించేందుకు తీవ్రంగా కృషి చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో తన నియోజకవర్గం నకిరేకల్​ రిజర్వ్​డ్​ కావడంతో నాగార్జునసాగర్​ నుంచి పోటీ చేసి అక్కడి పేద ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. నూరు పాళ్ల నాయకత్వ లక్షణాలు కలిగిన వెనుకబడిన తరగతుల నాయకుల్లో నోములది చెరగని ముద్ర. ప్రత్యేక గొంతుక.

ఆయన జీవితం ఆదర్శప్రాయం

విద్యార్థిగా, న్యాయవాదిగా, శాసనసభాపక్ష నాయకుడిగా విలక్షణమైన నాయకత్వ పటిమను కనబర్చిన అరుదైన నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పోరాట యోధుడు, నిత్య అన్వేషి, పట్టువదలని విక్రమార్కుడు, సాత్వికుడు, నేటి ప్రతిపక్షాలకు ఆదర్శ, ఆచరణీయ విధానాలను ముందుగానే ప్రదర్శించిన పేద ప్రజల పెన్నిధి నోముల నర్సింహయ్య మరణం తెలుగు జాతి ప్రజలకే కాక.. ప్రజల పక్షాన నిలబడే శక్తులన్నింటికీ విచారకరం. నేటి నాయకులు నోముల నర్సింహయ్య వంటి పట్టుదల గల నాయకుల పనితీరును గమనించి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఆయన జీవితం
ఆదర్శప్రాయం.

దోపిడీ కులాలకు వ్యతిరేకంగా పోరాటం

నకిరేకల్​ ప్రాంతంలో ఒకప్పుడు దోపిడీ కులాల అరాచకం చాలా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా కాంగ్రెస్​ వైపు నుంచి వారికి పూర్తి మద్దతు ఉండేది. అలాంటి సందర్భంలో ఒకసారి నోముల కుటుంబంపై దాడి చేసే ప్రయత్నం జరిగింది. వామపక్షాలు నర్సింహయ్య పక్షాన నిలిచి దాడిని తిప్పికొట్టాయి. ఆ దెబ్బతో వాళ్ల ఆధిపత్య ధోరణి తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. అలా దోపిడీ వర్గాలను ఎదుర్కోవడంలో నర్సింహయ్య ముందు వరుసలో ఉండేవారు. సీపీఐ(ఎం)లో కామ్రేడ్​ ఓంకార్​ తర్వాత పార్టీకి అంతటి పాపులారిటీ సంపాదించిపెట్టిన నాయకుడు నోముల నర్సింహయ్య. బషీర్​బాగ్​ విద్యుత్​ ఉద్యమం-కాల్పుల సంఘటన సందర్భంగా నోముల ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రభుత్వంపై గర్జించిన తీరు చరిత్రాత్మకం. సున్నం రాజయ్య, నోముల నర్సింహయ్య ఇద్దరే శాసన సభ్యులుగా ఉన్నప్పటికీ వారు శాసనసభలో పోరాడిన తీరు తెలుగు ప్రజానీకాన్ని ముగ్దుల్ని చేసింది. ఇటీవలి కాలంలో సున్నం రాజయ్య మరణించడం విచారకరం. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్​ మస్కు నర్సింహా మరణం నుంచి తేరుకోకముందే నోముల నర్సింహయ్య మరణించడం పేదల ఉద్యమాలకు తీరని లోటు.