ప్రధాన పార్టీల్లో..క్రాస్ ఓటింగ్ టెన్షన్

ప్రధాన పార్టీల్లో..క్రాస్ ఓటింగ్ టెన్షన్
  •     పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు షేరింగ్ పై పార్టీల లెక్కలు
  •     క్రాస్ ఓటింగ్ మీద భిన్నాభిప్రాయాలు
  •     నల్గొండలో 74.02 శాతం పోలింగ్ నమోదు
  •     మెజార్టీపై కాంగ్రెస్ ధీమా
  •     ఓటింగ్ శాతం పెరడంపై బీఆర్ఎస్ ఆశలు
  •     కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్ల చీలిక కలిసొస్తుందంటున్న బీజేపీ 

నల్గొండ, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల లీడర్లు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్​ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ నేతలు భావిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలిపోవడంతోనే కాంగ్రెస్ కు భారీ మెజార్టీ వచ్చింది. జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే కాంగ్రెస్, బీజేపీ వైపే మెజార్టీ ఓటర్లు డిసైడయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతోనే నల్గొండ, భువనగిరిలో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధిస్తుందని ఆ పార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

నల్గొండలో తగ్గింది.. 

నల్గొండలో 74.02 శాతం పోలింగ్ నమోదైంది. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో17,25,465 మంది ఓటర్లకు 12,77,137  మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ 74. 11 శాతం నమోదుకాగా, గతంతో పోలిస్తే 09 శాతం తగ్గింది. ఏడు నియోజకవర్గాల్లో పురుషులు 8,44,843 మంది ఓటర్లకుగాను 6,33,597 మంది ఓటు వేశారు. మహిళలు 8,80,453 మందికిగాను 6,43,450 మంది, ఇతరులు 169 మంది ఓటర్లకుగాను 90 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

పోలింగ్ సరళిపై అంచనాలు..

పోలింగ్ సరళిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు, లీడర్లు ఎవరికి వారే లెక్కలు వేస్తున్నారు. నల్గొండ, భువనగిరిలో ప్రచారంతోపాటు డబ్బు, మద్యం పంపిణీలో కాంగ్రెస్ లీడర్లు సక్సెస్ అయ్యారని, బీఆర్ఎస్ ప్రచారంలో వెనబడిందని మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలోనే సూర్యాపేట, మిర్యాలగూడ తప్పిస్తే ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో వెనకబడిందని, ఈ ఎఫెక్ట్ ఓట్ల చీలికపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. దీంతోనే బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ వైపు మొగ్గు చూపారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్లు అంచనాకు వచ్చారు. 

పార్టీ కేడర్ ను కాపాడుకునేందుకు సూర్యాపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్​రావు కొంతమేర కష్టపడినప్పటికీ ఓటర్ల నుంచి ప్రతికూల స్పందనే కనిపించిందని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉందని భావించిన నల్గొండ, దేవరకొండ, సూర్యాపేట లాంటి పలు నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు కూడా డబ్బులు పంపిణీ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతోనే ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజీ భారీగా నమోదైందని అంచనా వేస్తున్నారు. 
 
స్థానం పదిలేమేనా..?

కొత్త ఓటర్లు, మైనార్టీలు, రైతులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల ఓటర్లపై ప్రధాన పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. దీన్ని బట్టే ఈ ఎన్నికల్లో ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో డిసైడ్ చేస్తుందని చెప్తున్నారు. మొదటి, రెండు స్థానాల గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిన బీఆర్ఎస్ ఓటర్లు తిరిగి తమవైపు వచ్చారని, దీంతో తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరదని చెప్తున్నారు. ఇక కొత్త ఓటర్లు, బీసీ సెంటిమెంట్, మోదీ మానియాతో యువకులు బీజేపీకి టర్న్ అయ్యారని, క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్ బీజేపీకి కొంతవరకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థులు, లీడర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. 

 భువనగిరిలో 76.78 శాతం

యాదాద్రి, వెలుగు : భువనగిరి నియోజకవర్గంలో పోలింగ్​శాతం పెరిగింది. గతంలో 74.42 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి 76.78 శాతం మంది ఓటు వేశారు. ఈసారి పోలింగ్​శాతం పెరిగడంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో భువనగిరి నిలిచింది. అయితే ఐదు నెలల క్రితమే జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్​శాతం తగ్గింది. ఈసారి కూడా మహిళల కంటే పురుషులే ఎక్కువగా పోలింగ్​లో పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 18,08585 మంది ఓటర్లు ఉన్నారు. 

సోమవారం జరిగిన ఎన్నికల్లో 13,88,680 మంది (76.78 శాతం)  ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో 16,27,257 ఓటర్లు ఉండగా 12,11,256 మంది (74.42 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఏడు అసెంబ్లీ నియోకవర్గాల్లో మునుగోడులో 83.71 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో మొదటి స్థానంలో నలిచింది. ఆ తర్వాత స్థానంలో ఆలేరులో 82.81, భువనగిరిలో 82.71, నకిరేకల్​లో 77.11 జనగామలో 74.68, తుంగతుర్తిలో 74.06, ఇబ్రహీంపట్నంలోనే 66.83 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.