సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య

సగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: సగర ఫెడరేషన్ ను కార్పొరేషన్​గా మార్చి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్​లో సగర ఉప్పర హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీరడి భూపేశ్​సాగర్ ఆధ్వర్యంలో భగీరథ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని సగరులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీ రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సగరుల నుంచి కనీసం ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్ లేకపోవడం బాధాకరమన్నారు. సగరులు అభివృద్ధి చెందాలంటే బీసీ–డి నుంచి బీసీ–ఎకు మార్చాలని డిమాండ్​చేశారు. ప్రభుత్వం సగరులకు విద్య, ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విజయేంద్ర సాగర్, భూపేశ్​ సాగర్ మాట్లాడుతూ.. జమ్మూ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బిహార్, అస్సాం, కర్ణాటకలో సగరులను బీసీ–ఎగా పరిగణిస్తున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ–డిగా గుర్తిస్తున్నారని, వెంటనే బీసీ–ఎ గ్రూప్ నకు మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ సాగర్, పార్థసారథి సాగర్, కోల్లా జనార్దన్, నందగోపాల్, అనంతయ్య, జయంతి, ఉదయ్ నేత, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.