30 మహిళా సంఘాలకు లోన్లు కట్టాలని నోటీసులు..ఫేక్ సంఘాల లోన్ల వ్యవహారంలో ట్విస్ట్..

30 మహిళా సంఘాలకు లోన్లు కట్టాలని నోటీసులు..ఫేక్ సంఘాల లోన్ల వ్యవహారంలో ట్విస్ట్..

యాదాద్రి, వెలుగు :  ఫేక్​ సంఘాలను సృష్టించడంతో పాటు సభ్యులకు తెలియకుండానే లోన్లు తీసుకున్న ఘటనలో ట్విస్ట్​చోటు చేసుకుంది. వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని మహిళా సంఘాల్లోని మహిళలకు కెనెరా బ్యాంకు లీగల్​ నోటీసులు పంపించింది. దీంతో సభ్యులు మెప్మాను ఆశ్రయించారు. 

38 సంఘాల సృష్టి, లోన్లు

యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో సభ్యులు లేకుండా 38 ఫేక్​ సంఘాలను సృష్టించిన ఆర్పీలు కెనెరా బ్యాంకులో లోన్లు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని సంఘాల్లో సభ్యుల సంతకాలు తీసుకొని మొత్తంగా రూ. 7.99 కోట్ల లోన్లు తీసుకున్నారు. ఈ ఫేక్​ లోన్ల ఉదంతంలో నలుగురు ఆర్పీల పాత్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వారు జైలుకు సైతం వెళ్లి వచ్చారు. ఈ విషయంలో బ్యాంకు రూల్స్​కు విరుద్ధంగా లోన్లు ఇచ్చిందున తమకు సంబంధం లేదని, లోన్లు ఇప్పించిన ఆర్​పీల నుంచి వసూలు చేసుకోవాలని మెఫ్మా స్పష్టం చేసింది. దీంతో ఇష్యూ ముగిసిపోయిందని అంతా భావించారు.

300 మందికి​ లీగల్​ నోటీసులు

లోన్లు తీసుకున్నట్టుగా రికార్డుల్లో ఉన్న సంఘాలకు  కెనెరా బ్యాంకు, తమ అడ్వోకేట్​ ద్వారా లీగల్​ నోటీసులు జారీ చేసింది. ఈ విధంగా 30 సంఘాల్లోని 300 మంది మహిళలకు లీగల్​ నోటీసులు అందాయి. వడ్డీతో సహా చెల్లించాలని అందులో పేర్కొన్నారు. లేకపోతే ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందని తెలిపారు. 

అడిషనల్​ కలెక్టర్​కు ఫిర్యాదు

లీగల్​ నోటీసులు అందుకున్న మహిళలు ఆందోళనతో భువనగిరి పోలీసులను ఆశ్రయించి ఆర్​పీలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆర్​పీలపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని, తాము పరిశీలిస్తామని చెప్పినట్టు మహిళలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్​లో మెప్మా ఆఫీసుకు వెళ్లి యాదాద్రి అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావును కలిసి నోటీసులు అందించారు. 

నోటీసుల విషయంలో ఆందోళన చెందవద్దని వారికి నచ్చజెప్పారు.  లోన్లు ఇవ్వడంలో కెనెరా బ్యాంకు రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరించిందని, ఆర్​పీల నుంచి బ్యాంకు రికవరీ చేసుకోవాల్సిఉంటుందన్నారు. నోటీసుల విషయంలో బ్యాంకర్లతో తాను మాట్లాడుతానని మహిళ సంఘాల సభ్యులకు ఆయన తెలిపారు.