ఓర్నాయనో.. ఇదెక్కడి రూల్.. పెళ్లి చేసుకుంటే పోలీసులకు చెప్పాల్సిందే!

ఓర్నాయనో.. ఇదెక్కడి రూల్.. పెళ్లి  చేసుకుంటే పోలీసులకు చెప్పాల్సిందే!

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి వేడుకలు ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయి. అందుకే ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా అంగరంగవైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులను సైతం ఆహ్వానించి, అందరి ఆశీర్వాదాలతో నూతన జీవితంలోకి అడుగుపెడతారు. ఇంత ముఖ్యమైన వేడుకలు కొందరి ఇళ్లలో కొందరి అత్యుత్సాహం, అనాలోచిత చర్యల వల్ల విషాదం అలముకుంటోంది. కొందరు తమ ఉత్సాహాన్ని బాహాటంగా ప్రదర్శించడం కోసం గాలిలోకి కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి దుర్ఘటనలను నివారించేందుకు బిహార్ పోలీసులు ఓ మార్గాన్ని కనిపెట్టారు.

కొత్త రూల్స్ ప్రకారం ..

కొత్త మార్గదర్శకాల ప్రకారం తమ కుమార్తె లేదా కుమారునికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తల్లిదండ్రులు, పెళ్లి జరిగే తేదీకి ముందు స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని  బిహార్ పోలీసులు  కొత్త రూల్ తీసుకొచ్చారు.  కళ్యాణమండపాలు, ఫంక్షన్ హాళ్లు, మరియు ధర్మశాలల యజమానులు సీసీటీవీ కెమెరాలతో సహా భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించాలి.తమ ఇంటి వద్ద వివాహాలు నిర్వహించుకునే వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తమ వద్ద ఉన్న లైసెన్స్ ఆయుధాల జాబితాను అందించాలని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతిథుల జాబితాను అందించాలని కోరారు.పెళ్లి వేడుకలు, బర్త్ డే పార్టీలు, మ్యారేజ్ యానివర్సరీ పార్టీలు మొదలైనప్పుడు ఉత్సాహంగా ఉన్నవారు గాలిలోకి కాల్పులు జరపడం గమనించాము.ఇటువంటి సంఘటనలను నిరోధించాలనే ప్రయత్నంలో భాగంగానే, పెళ్లి జరిగే తేదీ, సమయం, ప్రదేశం వంటి వివరాలను తమకు తెలియజేయాలని కోరుతున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాల్స్, ధర్మసత్రాలు వంటివాటికి కూడా ఈ ఆదేశాలు ఇచ్చారు.  అనవసరంగా కాల్పులు జరపడం చట్టరీత్యా నేరమని, నేరస్తులపై చర్యలు, జైలు శిక్షలు తప్పవని సంజయ్ సింగ్ తెలిపారు.

 సెలబ్రేటరీ ఫైరింగ్ కేసులు

సెలబ్రేటరీ ఫైరింగ్ వల్ల అనేక మంది మరణించారని, గాయపడ్డారని  బీహార్ శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ సంజయ్ సింగ్  చెప్పారు. భద్రతకు సంబంధించిన అన్ని నియమ, నిబంధనలను పాటించాలని చెప్పినట్లు తెలిపారు. 2022లో 99 సెలబ్రేటరీ ఫైరింగ్ కేసులు నమోదు చేశామన్నారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 36 మంది గాయపడ్డారన్నారు.  18 ఆయుధాలను స్వాధీనం చేసుకొని.. 8 ఆయుధాల లైసెన్స్‌లను కూడా రద్దు చేశామన్నారు. 2023లో మే 31 వరకు ఇటువంటి కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించి 72 మందిని అరెస్టు చేసి 3 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సింగ్ తెలిపారు.