ఎన్టీఏను రద్దు చేయాల్సిందే..పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి : ఎమ్మెల్యే కూనంనేని,  కోదండరామ్, జాన్ వెస్లీ

ఎన్టీఏను రద్దు చేయాల్సిందే..పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి : ఎమ్మెల్యే కూనంనేని,  కోదండరామ్, జాన్ వెస్లీ
  • కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
  • రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని, కోదండరామ్, జాన్ వెస్లీ

హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాల దారుణ వైఫల్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  జాన్ వెస్లీ ఆరోపించారు. ఈ పరీక్ష నిర్వహించడంలో ఫెయిలైన ఎన్​టీఏను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకే దేశం–ఒకే పరీక్ష పేరుతో విద్యను కేంద్రీకరించడంతోనే ఈ అక్రమాలు, కోచింగ్ మాఫియా దందాలు పెరిగాయని వారు విమర్శించారు.

బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌‌యూ తదితర సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం ఆడుతోందని ఎమ్మెల్యే సాంబశివరావు మండిపడ్డారు. పేపర్ లీకేజీలపై కనీస బాధ్యత తీసుకోకుండా, మళ్లీ ఎన్టీఏతోనే రీ- నీట్ నిర్వహించడం తప్పులను కప్పిపుచ్చుకోవడమేనని విమర్శించారు.

ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ.. రాష్ట్రాల సామాజిక, భాషా పరిస్థితులను పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా విద్యార్థులపై ఒకే పరీక్షను రుద్దడం అన్యాయమని అన్నారు. దీంతో  గ్రామీణ, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు నష్టపోతుంటే.. కోచింగ్ మాఫియా వేల కోట్ల వ్యాపారం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రం విద్యను కార్పొరేటీకరణ చేస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నీట్ వ్యవస్థ ప్రతిభను కాకుండా, కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్థోమతను మాత్రమే కొలుస్తోందని చెప్పారు. మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, చలపతిరావు, అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు విమలక్క, ఎస్​యూసీఐసీ రాష్ట్ర కార్యదర్శి మురహరి, వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు నాగరాజు, మణికంఠ రెడ్డి, లక్ష్మణ్,  అనిల్, నాగరాజు, బాలు, కిరణ్, మహేశ్, పృథ్వీ, మురళి తదితరులున్నారు.