ఒడిశా రైలు ప్రమాదంలో మరో ట్విస్ట్... పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ

ఒడిశా రైలు ప్రమాదంలో మరో ట్విస్ట్... పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద దర్యాప్తులో..కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్ వేసింది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌ లాకింగ్ సిస్టమ్‌లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ఒడిశా రైలు దుర్ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలపడంతో ఆ కోణంలో సీబీఐ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం సిగ్నల్ జేఈని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే అతన్ని మళ్లీ ప్రశ్నించేందుకు ఇంటికి వెళ్లగా.. సిగ్నల్ జేఈ తన కుటుంబంతో పారిపోయాడు. దీంతో అతని ఇంటికి సీబీఐ సీల్ వేసింది. జేఈ అమీర్ ఖాన్ ఇంటిపై నిఘాకు ఇద్దరు అధికారులను నియమించింది.
 
జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు 290 మందికి పైగా మరణించగా, వందలాది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ  ప్రమాదంపై సీబీఐ  జూన్ 6న విచారణ చేపట్టింది.  ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను తారుమారు చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. 

జూన్ 2వ తేదీన  కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బాలాసోర్‌లో పట్టాలు తప్పింది. ఆ తర్వాత లూప్ లైన్‌లో  ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.  ఈ ఘటనలో  కొన్ని కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పై ప్రయాణిస్తున్న మరో ప్యాసింజర్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో కోచ్‌ల శకలాలు ఎగిరిపోయాయి. గూడ్స్ రైలు బండిపైకి కోరమాండల్ రైలు ఇంజన్ ఎక్కింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 292 మంది ప్రయాణికులు మరణించారు. 1200 మందికి పైగా గాయపడ్డారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.  ఘటన జరిగిన తర్వాత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పాటు ప్రధాని నరేంద్ర  మోదీ బాలాసోర్‌ వెళ్లి ఘటనాస్థలిని సందర్శించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్  మూడు రోజుల పాటు ఘటనా స్థలంలో ఉండి 51 గంటల్లోనే రైలు మార్గాన్ని పునరుద్ధరించారు. 

ప్రమాదంపై ఆరోపణలు..

ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం వల్లే ఒడిశా రైలు దుర్ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.  రైలు వస్తున్నప్పుడు పూర్తి సమాచారం తెలిసిన తర్వాత పై నుంచి వచ్చే ఆదేశాల మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబడుతుందని  ఖుర్దా డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేష్ రాయ్ వివరించారు. సిగ్నల్ వ్యవస్థలో  ఏదైనా చిన్న సమస్య ఎదురైతే రెడ్  సిగ్నల్  పడుతుందన్నారు. కానీ బాలాసోర్ రైలు ప్రమాద సమయంలో గ్రీన్ సిగ్నల్ పడటం వెనుక  ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో  ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చని చెప్పారు .

రైల్వే ఉద్యోగుల పాత్రపై అనుమానాలు..

ఈ రైలు ప్రమాదంలో బహనాగ బజార్‌ రైల్వే స్టేషన్ మాస్టర్‌తో సహా ఐదుగురు రైల్వే ఉద్యోగుల ప్రమేయం ఉందన్న కోణంలో సీబీఐ  దర్యాప్తు చేస్తోంది. 

 రైల్వే సిగ్నల్ వ్యవస్థలో JE పాత్ర

రైల్వే సిగ్నల్ వ్యవస్థలో  JEల పాత్ర కీలకం.  సిగ్నలింగ్ నిర్వహణపై JEలదే బాధ్యత.  సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్‌లు, పాయింట్ మెషీన్‌లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లను నిర్వహిస్తారు. ఈ వ్యవస్థల సజావుగా పని చేసేలా చూసుకోవడం, అన్ని సమయాల్లో సురక్షితమైన రైలు కార్యకలాపాలను నిర్వహించడంలో JEలే  కీలక పాత్ర పోషిస్తారు.