ఒలింపిక్‌‌‌‌ పతకం ప్రతి ఒక్కరి కల.. నేను గోల్డ్‌‌‌‌ సాధించా

ఒలింపిక్‌‌‌‌ పతకం ప్రతి ఒక్కరి కల.. నేను గోల్డ్‌‌‌‌ సాధించా
  • ఇంతకంటే ఏం ఆశిస్తా?
  • ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను
  • నా కష్టానికి, త్యాగాలకు ప్రతిఫలం ఇది
  • ఇకపైనా ఆటపైనే ఫోకస్‌‌‌‌
  • పారిస్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ తెస్తా

ఒలింపిక్స్‌‌‌‌లో పాల్గొనాలని, మెడల్‌‌‌‌ సాధించాలని ప్రతి ఒక్కరు కలగంటారు..! కానీ, కొందరే దాన్ని నిజం చేసుకుంటారు..! ఆ కొందరిలో జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌ నీరజ్‌‌‌‌ చోప్రా కూడా ఒక్కడు..!  అయితే, చోప్రా తనొక్కడి కలనే  కాదు.. యావత్‌‌‌‌ దేశం కలను సాకారం చేశాడు..! ఒలింపిక్స్‌‌‌‌  ట్రాక్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌లో వందేళ్ల పోరాటం తర్వాత ఇండియాకు తొలి మెడల్‌‌‌‌, అది కూడా గోల్డ్‌‌‌‌ అందించాడు.  ఇంత గొప్ప ఘనతను సాధించినందుకు, ఒలింపిక్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ స్టేడియంలో మన జెండా ఎగరవేసినందుకు చాలా గర్వపడుతున్నానని నీరజ్ చెప్పాడు..!  తాను ఇంతకంటే ఇంకా ఏం ఆశిస్తానని అంటున్నాడు..! ఇన్నేళ్ల తన కష్టం, చేసిన త్యాగాలకు ప్రతిఫలమే ఈ పతకమని తెలిపాడు. 

న్యూఢిల్లీ: ఒలింపిక్​ గోల్డ్​తో తన కల సాకారమైనా పోరాటం ఆపబోనని, ఇకపై కూడా ఆటపైనే ఫోకస్‌‌‌‌ పెడతానని ఇండియా నయా హీరో నీరజ్​ చోప్రా స్పష్టం చేశాడు. ఇండియా ఫస్ట్‌‌‌‌  ట్రాక్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ అనే ఫీలింగ్‌‌‌‌ గర్వంగా ఉందని తెలిపాడు. టోక్యో లో అదరగొట్టి ఇండియా వచ్చిన నీరజ్​ ఓ ఇంటర్వ్యూలో  తన జర్నీ గురించి చెప్పాడు. ఈ వివరాలు అతని మాటల్లోనే..

ఇండియా అథ్లెటిక్స్​కు మంచి రోజులు
ఒలింపిక్స్‌‌‌‌ ట్రాక్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌లో ఇండియాకు తొలి మెడల్‌‌‌‌, అది కూడా గోల్డ్‌‌‌‌ అందించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా.  ఈ మెడల్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో  కొత్త విప్లవానికి  నాంది పలికింది. ఈ సంతోషాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు. స్టేడియంలో మన జెండా ఎగిరినప్పుడు, జాతీయ గీతం వినిపించినప్పుడు మాత్రం నేను చాలా గర్వపడ్డా. ఇండియన్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌కు మున్ముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయని భావిస్తున్నా. 2019లో ఇంజ్యురీ కారణంగా, 2020లో కరోనా వల్ల నేను చాలా సమయం కోల్పోయా. అప్పుడు ఎదురైన చేదు జ్ఞాపకాలన్నింటినీ ఈ గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ చెరిపేసింది. అలాగే నాకెంతో సంతృప్తి కలిగించింది. ఎందుకంటే ప్రతీ అథ్లెట్‌‌‌‌ తన లైఫ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ఒక్కసారైనా ఒలింపిక్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గాలని కలగంటాడు. నేనిప్పుడు  ఏకంగా గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించా. ఇంతకంటే ఇంకా నేను ఏం ఆశిస్తాను?.

ప్రతి త్రోకు బెస్ట్​ ఇవ్వాలనుకున్నా
ఫైనల్‌‌‌‌ జరుగుతున్నప్పుడు ప్రతి త్రోకు బెస్ట్‌‌‌‌ ఇవ్వాలని అనుకున్నా. అదే టైమ్‌‌‌‌లో నా త్రోలతో  నా బాడీ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌ సహకరించేలా చూసుకున్నా.  జావెలిన్‌‌‌‌ త్రో అనేది  ఎక్కువగా టెక్నికల్‌‌‌‌ గేమ్‌‌‌‌. ఇందులో మనం చాలా సహనంగా, మన మెదడుకు ఎక్కువ పని పెట్టాలి. టెక్నిక్‌‌‌‌లో ఏ తప్పిదం ఉన్నా అటెంప్ట్‌‌‌‌ మొత్తం వృథా అవుతుంది.  నా ఆటపై ముందు నుంచే చాలా కాన్ఫిడెన్స్‌‌‌‌గా ఉన్నా. మిగతా కాంపిటీటర్స్ వాళ్ల చివరి ప్రయత్నాల్లో  బెస్ట్ ఇవ్వకపోయినప్పుడు నేను గోల్డ్‌‌‌‌ నెగ్గానని రియలైజ్‌‌‌‌ అయ్యా. 

అందుకే మిల్కాకు అంకింతమిచ్చా
మిల్కా అథ్లెటిక్స్‌‌‌‌ కెరీర్‌‌‌‌కు సంబంధించి చాలా వీడియోలను చూశా. ఇండియన్‌‌‌‌ ట్రాక్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌ అథ్లెట్స్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ పోడియంపై నిల్చోవాలని ఆయన కోరుకున్నారు. 1960 రోమ్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో ఆయన కొద్దిలో మెడల్‌‌‌‌ మిస్సయ్యారు. కాబట్టి మరే ఇండియన్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌ అయినా ఒలింపిక్స్‌‌‌‌కు వెళ్లి పతకం నెగ్గాలని ఆశించారు. నేను గోల్డ్‌‌‌‌ నెగ్గిన తర్వాత జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు మిల్కా చెప్పిన మాటలన్నీ నా మైండ్‌‌‌‌లోకి వచ్చాయి. అప్పుడు నా ఎమోషన్స్‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌ చేసుకోలేకపోయా. పోడియంపై నిల్చుకున్నప్పుడు కూడా ఆయన గురించి, ఆయన చిరకాల కోరిక గురించే ఆలోచించా. అందుకే మెడల్‌‌‌‌ను ఆయనకు అంకింతం చేశా. 

ప్రశాంతంగా నిద్రపోతా
ఈ మెడల్​తో ఇన్నేళ్లుగా నేను పడ్డ కష్టానికి, చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కిందని అనిపించింది. ఆ ఫీలింగ్‌‌‌‌ను మాటల్లో చెప్పలేను. ఆ క్షణాన్ని ఆస్వాదించానంతే. మీరు కూడా చూశారు. ప్రస్తుతానికైతే ఈ విజయాన్ని ఆస్వాదిస్తా. ఇంటికెళ్లగానే అమ్మ చేసే ‘చూర్మ’ తింటా.  నాకిప్పుడు బ్రేక్‌‌‌‌ అవసరం. చాలా అలసిపోయాను. ప్రశాంతంగా నిద్రపోతా. ఆ తర్వాత  నా ట్రెయినింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసి వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌, ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్స్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెడతా. 

నాలో ఓ  స్టార్​ను చూస్తున్నందుకు హ్యాపీ
ఒలింపిక్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ తర్వాత సోషల్ మీడియాలో ఫాలోవర్లు అమాంతం పెరగడం చూశా. ప్రజలు నన్ను గుర్తించినందుకు, నాలో ఓ స్టార్‌‌‌‌ను చూస్తున్నందుకు సంతోషమే. ఇక, నా లైఫ్‌‌‌‌ ఆధారంగా సినిమా (బయోపిక్‌‌‌‌) వస్తే, అందులో నేనే నటించాలని కోరుకుంటున్నారని విన్నా. ప్రస్తుతానికి నా ఫోకస్‌‌‌‌ మొత్తం ఆటపైనే. తర్వాతే బయోపిక్‌‌‌‌. దానికేం తొందర లేదు.  నేను రిటైరైన తర్వాత నాపై బయోపిక్‌‌‌‌ తీయొచ్చు. ఈ ఆటలో నేను మరింత సాధించాలని, దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. ఓ అథ్లెట్‌‌‌‌గా నాకు మరింత గౌరవం సంపాదించాలని ఆశిస్తున్నా. 

ఈ మెడల్‌‌ దేశం మొత్తానిది
ఈ మెడల్‌‌ నా ఒక్కడిదే కాదు. దేశం మొత్తానిది. ఈ సందర్భంగా ఇండియా అథ్లెట్లకు నేనో విషయం చెబుతున్నా. ఎదురుగా ఎవరున్నా సరే మీరు మీ బెస్ట్‌‌ ఇవ్వండి. మీరు చేయాల్సింది అదే. ఈ గోల్డ్‌‌ మెడల్‌‌ దాని వల్లే వచ్చింది. కాబట్టి ప్రత్యర్థిని చూసి అస్సలు భయపడొద్దు. ఇక, ఫైనల్‌‌ ముగిసిన తర్వాతి రోజు నా శరీరం మొత్తం ఏదోలా అనిపించింది.  ఒళ్లంతా నొప్పిగా అనిపించింది. కానీ, ఆ బాధకు ఎంతో విలువ ఉందని నాకు తెలుసు. 

హగ్‌‌‌‌ చేసుకొని సారీ చెప్పిండు

బౌట్‌‌‌‌లో తనను కొరికిన రెజ్లర్‌‌‌‌పై  రవి దహియా

టోక్యో ఒలింపిక్స్‌‌‌‌  సెమీఫైనల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో తనను కొరికిన కజకిస్తాన్‌‌‌‌ రెజ్లర్ నురిస్లామ్‌‌‌‌ సనయెవ్‌‌‌‌ తర్వాతి రోజు తనకు సారీ చెప్పాడని ఇండియా స్టార్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌, సిల్వర్‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌ రవి దహియా తెలిపాడు. నురిస్లామ్‌‌‌‌తో సెమీఫైనల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకొని గెలిచిన దహియా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, ఈ బౌట్‌‌‌‌లో నురిస్లామ్‌‌‌‌.. దహియా కుడి చేయి కండను గట్టిగా కొరకడం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన రవి..   కజక్‌‌‌‌ బాక్సర్‌‌‌‌ తనకు సారీ చెప్పాడని తెలిపాడు. ‘తర్వాతి రోజు వెయిట్​(బౌట్‌‌‌‌కు ముందు బరువు కొలుచుకోవడం) కోసం వెళ్లినప్పుడు.. నాకంటే ముందే సనయెవ్‌‌‌‌ అక్కడ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇచ్చాడు. అప్పటికే జరిగిన విషయం నేను మర్చిపోయా. కాబట్టి నేను కూడా విష్‌‌‌‌ చేశా. ఆ తర్వాత తను నన్ను హగ్‌‌‌‌ చేసుకొని.. సారీ బ్రదర్‌‌‌‌ అన్నాడు. చిరునవ్వుతో నేను కూడా అతడిని హగ్‌‌‌‌ చేసుకున్నా. మేమిద్దరం ఫ్రెండ్సే. ఆ తర్వాత ఇతర విషయాలపై సరదాగా మాట్లాడుకున్నాం’ అని దహియా చెప్పుకొచ్చాడు. ఇక, టోక్యోలో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ నెగ్గినందుకు హ్యాపీగా ఉన్నానని రవి చెప్పాడు.  కానీ, తను గోల్డ్‌‌‌‌ తేవాలని అనుకున్నానని తెలిపాడు. వచ్చే పారిస్​ ఒలింపిక్స్​లో కచ్చితంగా గోల్డ్​ నెగ్గుతానని దహియా నమ్మకం వ్యక్తం చేశాడు.