నిలకడగా మనస్విని ఆరోగ్యం: వైద్యులు

నిలకడగా మనస్విని ఆరోగ్యం: వైద్యులు

హైదరాబాద్: ప్రేమోన్మాది వెంకటేష్ దాడిలో గాయపడిన మనస్విని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు . మంగళవారం చైతన్యపురిలోని ఓ లాడ్జిలో  ప్రేమికుడి చేతిలో కత్తిపోట్లకు గురైన మనస్వి..  ప్రస్తుతం ఓమ్ని హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. హాస్పిటల్ కు తీసుకువచ్చిన వెంటనే ఆమెను ఐసీయూకి తరలించి వైద్యం అందించామన్నారు. దాడిలో గొంతుపై లోతైన గాయం కావడంతో 4 గంటలు పాటు తీవ్రంగా శ్రమించి సర్జరీ చేశామని తెలిపారు. సర్జరీకి మనస్విని సహకరించిందని, సర్జరీ సమయంలో 5 యూనిట్ల రక్తం అవసరమైందని తెలిపారు.

వెంకటేష్ దాడిని ప్రతిఘటించే క్రమంలో మనస్వి చేతి వేళ్ళు తెగి పోయాయని, దీంతో ఆమెకు ఆర్దో,ప్లాస్టిక్ సర్జరీ చేసి  సరి చేశామని వైద్యులు అన్నారు. ఈ రోజు 11 గంటల సమయంలో వెంటిలేటర్  తొలగించామని.. స్వయంగా శ్వాస కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉన్నందున  మనస్వినిని 48 గంటల పాటు ఐసీయూలో ఉంచి, నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.  స్పృహలో ఉండి,వైద్యుల మాటలకు స్పందిస్తోందన్నారు. మెడ పై స్టిచెస్ ఉన్నందున రెండు రోజుల వరకు మాట్లాడే అవకాశం లేదని వైద్యులు తెలిపారు.