29 వారాల గర్భం తొలగింపు​ ఆదేశాలపై తీర్పు వాపస్​ : హైకోర్టు

29 వారాల గర్భం తొలగింపు​ ఆదేశాలపై తీర్పు వాపస్​ : హైకోర్టు

న్యూఢిల్లీ : పెండ్లయ్యాక భర్త చనిపోయిన మహిళ తన 29 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకోవచ్చన్న తమ ఉత్తర్వులను వాపస్ తీసుకుంటున్నట్లు ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. పోయినేడాది ఫిబ్రవరిలో పెండ్లి చేసుకున్న ఓ మహిళ భర్త అక్టోబర్​లో చనిపోయాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమె అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన 29 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలంటూ ఆమె డిసెంబర్​లో ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. ఈ కేసులో కోర్టు ఆ మహిళకు అనుకూలంగా జనవరి 4న తీర్పునిచ్చింది.

అయితే, పుట్టబోయే బిడ్డ హక్కును కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును కోరింది. మరోవైపు, ఆమె కండిషన్​ను పరిశీలించిన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు.. ప్రస్తుత పరిస్థితిలో అబార్షన్​ వల్ల ఆ మహిళకు ప్రమాదమని, ఇంకో రెండు మూడు వారాలు గడిస్తే ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టే అవకాశం ఉందని కోర్టుకు వెల్లడించింది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి అదే సరైందని పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్.. ఈ కేసులో తాము ఇచ్చిన తీర్పును రీకాల్ చేస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులిచ్చారు.