ఆర్డ‌ర్ క‌రువు.. బ‌తుకు బ‌రువు

ఆర్డ‌ర్ క‌రువు.. బ‌తుకు బ‌రువు

గణేశ్ విగ్రహాలకు ఆర్డర్లు లేక అల్లాడుతున్న తయారీదారులు

ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటా చిన్న, పెద్ద సైజు విగ్రహాలు దాదాపు 5 వేలకు పైగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తుంటారు. దాదాపు ఆర్నెళ్ల ముందు నుంచే కళాకారులు వీటిని తయారు చేసే ప్రక్రియ మొదలు పెడతారు. మూడు, నాలుగు అడుగుల విగ్రహాల నుంచి 10, 12 అడుగుల సైజు విగ్రహాలను కూడా తయారు చేస్తుంటారు. కొందరు హైదరాబాద్‌ నుంచి విగ్రహాలను తెచ్చుకుంటారు. మరికొందరు స్థానికంగానే ఆర్డర్ ఇచ్చి విగ్రహాలను తయారు చేయిస్తారు. ఇలా ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉమ్మడి జిల్లాలో 70కి పైగానే ఫ్యామిలీస్‌ ఉండగా..సుమారు 200 మంది వరకు ఉంటారు. అయితే.. ఈసారి కరోనా ఎఫెక్ట్ కారణంగా ఇప్పటివరకు విగ్రహాల తయారీదారులకు ఎలాంటి ముందస్తు ఆర్డర్లు రాలేదు. వందల సంఖ్యలో విగ్రహాలు తయారు చేసే వారు కూడా ఇప్పుడు పెట్టుబడులను కాస్త తగ్గించుకొని పరిమిత సంఖ్యలోనే రెడీ చేస్తున్నారు. అమ్ముడు పోకుండా ఎక్కడ మిగిలిపోతాయోనన్న భయంతో పెద్ద సైజు విగ్రహాల తయారీని కూడా మానుకున్నట్లు తయారీదారులు చెబుతున్నారు.

పెద్ద విగ్రహాలు ఎక్కడా కనిపిస్తలేవ్‌..

ఖమ్మంతో పాటు వైరా, మధిర, సత్తుపల్లి పట్టణాల్లో విగ్రహాల తయారీదారులున్నారు. ఇక్కడ తయారయ్యే విగ్రహాల కోసం సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు వస్తారు. ప్రధానంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు పట్టణ శివారల్లో ప్రత్యేక గుడారాలు వేసుకొని విగ్రహాలు తయారు చేస్తారు. ఖమ్మం నగరంలో రోటరీనగర్‌, బైపాస్‌ రోడ్‌లోరాజస్థాన్‌ నుంచి వచ్చిన కుటుంబాలున్నాయి. వీళ్ల‌కు బల్క్ ‌అడ్వాన్స్ ఆర్డ‌ర్ ఇచ్చి చేయించుకుని వాటిని అమ్ముకునే వ్యాపారులు కూడా ఈసారి గిరాకీ సరిగా ఉండవేమోనన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు వారాల్లో వినాయక చవితి పండుగ ఉన్నా, ఈసారి ఎక్కడా పూర్తిగా సిద్ధమైన విగ్రహాలు కనిపించడం లేదు. ఇండ్లలో భక్తులు సొంతంగా పెట్టుకునే చిన్న విగ్రహాలను మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 5 వేల విగ్రహాల ద్వారా యావరేజీగా
రూ.5 వేల చొప్పున మొత్తం రెండున్నర కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈసారి కోటి రూపాయలైనా దాటుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యక్షంగా.. పరోక్షంగానూ లాస్‌

వినాయక చవితి పండుగ సందర్భంగా పత్రి, పూలు, మట్టి విగ్రహాలు, చిన్న విగ్రహాలు తయారుచేసే స్థానికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మంది దీనిపై ఆధారపడి ఉన్నారు. పండుగ సందడి లేకుంటే వారందరి జీవితాలపైనా ప్రభావం పడనుంది. అయితే పండుగ సందర్భంగా ఎలాంటి హంగామా, ఆర్భాటాలు లేకుండా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిరాడంబరంగా చవితి వేడుకలు
కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి. జనం గుమిగూడకుండా పండుగను ఎవరి ఇంట్లో వారే చేసుకోవాలి. సామూహిక నిమజ్జనాలు, వేడుకలు నిర్వహించవద్దు . కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, బోనాలవంటి పండుగలను నిరాడంబరంగా జరుపుకున్నాం. వినాయక చవితి పండుగను కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా నిర్వహించుకోవాలి.
 – పువ్వాడ అజయ్‌ కుమార్‌, రవాణా శాఖ మంత్రి

మ‌రిన్ని వార్త‌ల కోసం..