చనిపోతూ.. 8 మందికి ప్రాణదానం!.. సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ

చనిపోతూ.. 8 మందికి ప్రాణదానం!.. సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ
  • బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరి అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
  • పద్మ ఆండాళు అవయవాలతో మరో ముగ్గురికి కొత్త జీవితం 

హైదరాబాద్, వెలుగు: బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరి అవయవదానంతో 8 మంది రోగులకు పునర్జన్మ లభించింది. కామారెడ్డికి చెందిన సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి కుడిక్యాల వినయ్(26) బ్రెయిన్ ట్యూమర్‌ తో సెప్టెంబర్ 16న ఇంట్లోనే కుప్పకూలాడు. హైదరాబాద్‌ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 19న బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తీవ్ర దుఖంలోనూ వినయ్ తండ్రి మోహన్ అవయవదానానికి ముందుకొచ్చారు. వినయ్ నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులు, లివర్, రెండు కిడ్నీలతో ఐదుగురికి ప్రాణదానం జరిగింది.

ఇది ఈ ఏడాది నమోదైన 149వ అవయవదానం. మరో ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లా జులూరుకు చెందిన పద్మ ఆండాళు(60) తీవ్ర జ్వరంతో సెప్టెంబర్ 17న స్పృహ కోల్పోయారు. హైదరాబాద్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతూ ఆమె కూడా 19న బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆమె కుమారుడు వినోద్ కుమార్ తల్లి రెండు కిడ్నీలు, లివర్‌ ను దానం చేయడంతో మరో ముగ్గురికి కొత్త జీవితం దక్కింది.

ఇది ఈ ఏడు150వ అవయవదానం. దీంతో  రాష్ట్రంలో జీవన్ దాన్ కార్యక్రమంలో ఈ ఏడాది అవయవదానాల సంఖ్య 150వ మైలురాయిని చేరుకుంది. ఆపదలో ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచిన ఇరు కుటుంబ సభ్యులకు జీవన్‌ దాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.