వీఆర్ఎస్ కు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ దరఖాస్తు

వీఆర్ఎస్ కు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ దరఖాస్తు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లా డీన్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 జనవరి 1 నుంచి  వీఆర్ఎస్ కావాలని ఆయన దరఖాస్తులో పేర్కొన్నారు. బోళా శంకరుడిగా పేరున్న గాలి వినోద్ కుమార్.. ప్రజా సమస్యలపై పోరాటంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజా క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్న ఆయన.. జనం మధ్యన ఉంటూ ప్రజా సమస్యల గురించి పోరాడతానని స్పష్టం చేశారు. ఇప్పటికే సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా ఉన్న గాలి వినోద్... రానున్న రోజుల్లో పొలిటికల్ గా మరింత యాక్టివ్ కానున్నారు. 2015లో జరిగిన వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో గాలి వినోద్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన జాబ్ నుంచి రిలీవ్ అవుతుండటంతో రాజకీయ అరంగేట్రం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

వరంగల్ లోని మామునూర్ గాలి వినోద్ కుమార్ స్వస్థలం కాగా...  2008లో కేయూ నుంచి ఆయన లా పీహెచ్డీ పట్టా పొందారు. దేశంలోనే లా డిగ్రీతో యూజీసీ నెట్ సాధించిన మొట్టమెదటి దళితుడిగా గాలి వినోద్ గుర్తింపు పొందారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీడీహెచ్ఆర్ కోర్సు పూర్తి చేశారు. 2004లో ఓయూ లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన... ప్రస్తుతం ఆ శాఖకు డీన్ గా వ్యవహరిస్తున్నారు.