అన్ని దేశాలకంటే మన దేశీ రుచులు చాలా స్పెషల్

అన్ని దేశాలకంటే మన దేశీ రుచులు చాలా స్పెషల్

భారతీయ వంటలకు ఫిదా కాని వాళ్లుండరు. అన్ని దేశాలకంటే మన దేశీ రుచులు చాలా స్పెషల్. ఎందుకంటే మన వంటల్లో రకరకాల ఇన్‌గ్రెడియెంట్స్​ వాడతాం. అయితే, మనం చేసే వంటల్లో ఏదయినా ఇన్‌గ్రెడియెంట్ తగ్గితే దాని బదులు మరొకటి వాడొచ్చు. ‘అలాగని.. టేస్ట్​ మారుతుందేమో.. ’ అనే డౌట్​ అక్కర్లేదు. ఎందుకంటే టేస్ట్ మారకుండా అచ్చం ఒరిజినల్ టేస్ట్​ ఇచ్చేందుకు ఆల్టర్నేట్ ఇన్‌గ్రెడియెంట్స్ చాలా ఉన్నాయి.

టొమాటో లేకుండా ఏమైనా చేయగలమా? అనుకునేవాళ్లకు ఒక చిట్కా ఉంది. టొమాటోల బదులు వెనిగర్, నిమ్మరసం, పుల్లటి పెరుగు వంటివి వాడొచ్చు. మైదా బదులు గోధుమ పిండి వాడొచ్చు. గోధుమ పిండిని ముద్ద చేసి, రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత బేకింగ్ చేయాలి. అలాకాకుండా వెంటనే బేక్​ చేస్తే పొడిలా, ఉండలుగా అవుతుంది. చింతపండు.. చిటికెడు ఇంగువ మార్కెట్లో నిమ్మకాయలు దొరికినా కొన్ని ఐటమ్స్ మాత్రం చింతపండుతోనే చేస్తారు. చింతపండు రుచి వేరు, నిమ్మకాయ రుచి వేరు అంటారు. చింతపండు లేనప్పుడు చింతపండు వల్ల వచ్చే పులుపుకు సరిపడా నిమ్మరసం, లేదా రైస్​ వెనిగర్​ వాటితోపాటు చక్కెర కలిపి వాడొచ్చు. నిమ్మరసం ఒక్కటే వాడితే అందులో మూడు చుక్కలు వైట్ వెనిగర్ కూడా కలిపితే చిక్కగా ఉంటుంది. చిటికెడు ఇంగువ నూనెలో వేస్తే ఘాటైన వాసన వంటిల్లంతా వ్యాపిస్తుంది. ఇది డైజెషన్​కి చాలా మంచిదని మన వంటల్లో వాడతారు. ఇది లేనప్పుడు ఉల్లి లేదా అల్లం పొడి వేసుకోవచ్చు. అవి కూడా లేకపోతే తాజా ఉల్లిగడ్డ, అల్లం వేసుకోవచ్చు.

కుంకుమ పువ్వు ఖరీదెక్కువ కదా... 
కుంకుమ పువ్వు చాలా ఖరీదైంది. కాబట్టి అందరి ఇండ్లలో ఉండకపోవచ్చు. కానీ, బిర్యానీ, స్వీట్స్​ వంటివి చేసినప్పుడు కుంకుమ పువ్వు ఉంటేనే బాగుంటుంది. కుంకుమ పువ్వుకు బదులు రోజ్ వాటర్, చిటికెడు పసుపు కలపొచ్చు. 

మసాలాలు తయారు చేసుకోవచ్చు
ఈ మధ్యకాలంలో ఇంట్లోనూ రెస్టారెంట్, బేకరీ స్టైల్​ వంటలు చేస్తున్నారు. టీవీల్లో, యూట్యూబ్​లో చూసి పల్లెల్లో కూడా వాటిని ట్రై చేస్తున్నారు. అయితే, ఆ వంటలు చేయాలంటే రకరకాల మసాలాలు, చీజ్​, క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు అవసరమవుతాయి. వాటిని బయట కొనాలంటే రేటు ఎక్కువ. కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు.

చాట్, గరం, సాంబార్
చాట్​ మసాలాని సమ్మర్ డ్రింక్స్​లో, శాండ్​ విచ్, స్ట్రీట్ ఫుడ్​ తయారీలో, ఫ్రూట్స్ మీద చల్లడానికి వాడతారు. చాలామందికి దీన్నెలా తయారుచేస్తారో తెలియదు. సో.. కొన్నిసార్లు చాట్ మసాలా ఇంట్లో లేకపోతే దాని బదులు ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్​ చూర్ పొడి కలిపి వాడొచ్చు. లేదంటే నిమ్మరసం ఒక్కటే వాడొచ్చు. కాకపోతే ఏది వాడినా ఉప్పు తప్పని సరి. ఇలా చేస్తే చాట్ మసాలా లాంటి టేస్ట్​ వస్తుంది. లేదంటే, ఆమ్ చూర్, జీలకర్ర, శొంఠి, ధనియాలు, నల్ల మిరియాలు, ఇంగువ, కారం కలిపి వేసుకోవచ్చు. ఆమ్​చూర్ బదులు నిమ్మరసం. అలాగే గరం మసాలా బదులు మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం పొడి చేసి వేయాలి. సాంబార్ మసాలా బదులు ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేగించి వాటితోపాటు ఉలవలు కలిపి పొడి చేయాలి. 

చీజ్ – కెచెప్​ 
200 గ్రాముల పనీర్​ని 75గ్రాముల పెరుగు కలిపి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని మస్లిన్ క్లాత్​తో చుట్టి, రాత్రంతా ఉంచాలి. ​మరుసటి రోజు రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసి మరోసారి మిక్సీ పడితే క్రీమ్ చీజ్​ రెడీ. టొమాటో కెచప్​ కూడా చాలా ఇష్టంగా తింటారు మనవాళ్లు. అయితే కెచెప్​ లేనప్పుడు ఒక కప్పు టొమాటో సాస్, ఒక టీస్పూన్ వెనిగర్, చక్కెర కలిపి కెచెప్​లా తయారుచేసుకోవచ్చు. 

పాలు, కోడిగుడ్ల బదులు..
కేక్ తయారుచేయాలనుకున్నప్పుడు పాలు లేకపోతే అదే క్వాంటిటీలో పెరుగు వాడొచ్చు. కొన్నిసార్లు పాలు లేకపోతే నీళ్లు పోయొచ్చు. చిక్కదనం కోసం ఒక టేబుల్ స్పూన్ వెన్న వేయొచ్చు. లేదంటే... బాదం, కొబ్బరి, సోయా పాలతో చేసుకోవచ్చు. అవి వద్దనుకుంటే మిల్క్​ పౌడర్ కూడా మంచి ఆప్షనే. 

కోడిగుడ్లు లేకుండా బేకరీ ఐటమ్స్ చేయాలంటే ఫ్లాక్స్ ఎగ్స్ వాడాలి. అవేంటంటారా? అవిసెగింజల పొడి, నీళ్లు కలిపితే వచ్చే మిశ్రమాన్ని ఫ్లాక్స్ సీడ్ ఎగ్ (అవిసెగింజల ఎగ్స్) అంటారు. ఒక స్పూన్​ మిశ్రమం ఒక కోడిగుడ్డుతో సమానం. సో.. కోడిగుడ్డులో ఉండే పోషకాలు అందవేమోనన్న డౌట్ వద్దు. లేకపోతే అరటి లేదా యాపిల్ గుజ్జు వేసుకోవచ్చు. వెన్న బదులు నూనె, మజ్జిగ, పెరుగుతో అడ్జస్ట్ అవ్వొచ్చు.

వీటిని కూడా..
సొరకాయ లేనప్పుడు జుకిని వాడొచ్చు. మెంతికూర బదులు గ్రీన్​ యాపిల్, పాలకూర వాడొచ్చు.ఉల్లిగడ్డలు లేకపోతే లీక్స్, కైవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వాడొచ్చు. తాజా అల్లం బదులు శొంఠి, కసూరీ మేథీ లేకపోతే మెంతికూర వాడొచ్చు. బేకింగ్ సోడా బదులు ఈనో లేదా సోడానీళ్లు, కోడిగుడ్డు తెల్ల సొన కలిపి వాడొచ్చు. జీడిపప్పు పేస్ట్ బదులు నువ్వులు లేదా వేరు శనగల పేస్ట్ వాడొచ్చు. కార్న్​ఫ్లోర్ బదులు బియ్యప్పిండి వాడొచ్చు. కానీ.. ఆవాలు, కరివేపాకు, ధనియాలు, కొత్తిమీర, జీలకర్ర, మినప్పప్పు వంటివి అందుబాటులో  లేకపోతే వదిలేయండి. వాటి టేస్ట్ మరేవీ ఇవ్వలేవు. 
ఫోన్​ : 9247817732