- 150 మంది నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన శ్రీ ఇమ్మిగ్రేషన్
- వివరాలను ‘హైడ్’ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లతో బురిడీ
- న్యాయం చేయమంటే పోలీసులు అవహేళన చేస్తున్నారని బాధితుల ఆవేదన
గచ్చిబౌలి, వెలుగు: విదేశాల్లో ఉద్యోగం.. నెలకు లక్షల్లో జీతం.. అంటూ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలతో బురిడీ కొట్టించి, సుమారు 150 మంది నిరుద్యోగుల నుంచి రూ. 10 కోట్లు వసూలు చేసిన ‘శ్రీ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసాస్’ సంస్థ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు గురువారం గచ్చిబౌలిలో ఆందోళనకు దిగారు. న్యాయం చేయాల్సిందిపోయి చులకనగా మాట్లాడుతున్నారని వాపోయారు.
సోషల్ మీడియాలో ప్రకటనలు.. ఫేక్ వీసాలు..
బాధితుల వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని శ్రీ ఇమ్మిగ్రేషన్ కంపెనీ నిర్వాహకులు శ్రీ కిరణ్, నివేదిత కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ వంటి దేశాల్లో సాఫ్ట్వేర్, సూపర్ మార్కెట్, వేర్‌హౌజ్ సూపర్ వైజర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. అరుణ్ కుమార్అనే వ్యక్తి సంస్థ ప్రతినిధిగా బాధితులతో మాట్లాడి, డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు రవి అనే యువకుడు సోషల్‌మీడియాలో ప్రకటన చూసి, ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం ఈ సంస్థను సంప్రదించగా, నిందితుడు అరుణ్ కుమార్ అతడిని నమ్మించి రూ. 11 లక్షలు వసూలు చేశాడు.
డబ్బులు కట్టిన తర్వాత వీసా వచ్చిందని నమ్మించడానికి ఒక పత్రాన్ని రవికి పంపారు. అయితే, ఆ డాక్యుమెంట్లో వీసా గ్రాంట్ నంబర్, ట్రావెల్ డాక్యుమెంట్ నంబర్, అప్లికేషన్ ఐడీలను నిందితులు ఉద్దేశపూర్వకంగా కనిపించకుండా హైడ్ చేశారు. రవి దీనిపై నిలదీయగా.. మిగిలిన డబ్బులు కడితేనే పూర్తి వివరాలు ఉన్న వీసా కాపీ ఇస్తామని నమ్మబలికారు. రవి మరిన్ని డబ్బులు కట్టగా, తీరా అది నకిలీ వీసా అని తేలింది. కూకట్‌పల్లికి చెందిన ఐటీ ఉద్యోగి ప్రమోద్ కూడా ఇలాగే రూ. 13 లక్షలు చెల్లించి ఫేక్ వీసాతో మోసపోయాడు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 80 వేల నుంచి రూ. 18 లక్షల వరకు వసూలు చేసి దాదాపు 150 మంది నుంచి రూ. 10 కోట్ల మేర దోచుకున్నారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం
గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినా మొదట్లో పట్టించుకోలేదని, ఉన్నతాధికారుల ఒత్తిడితోనే కేసు నమోదు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితురాలితో ఓ ఎస్ఐ ‘‘వాళ్ల దగ్గరే డబ్బులు లేవు.. నీకు ఎలా ఇస్తారు?’’ అంటూ అవహేళనగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోచోట విదేశీ విద్య పేరుతో..
జూబ్లీహిల్స్ , వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ‘గ్రీన్ ట్రీ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ’ ప్రతినిధులు విదేశీ విద్య పేరుతో తనను మోసం చేశారంటూ హయత్‌నగర్‌కు చెందిన గుర్రం మనోహర్(25) పోలీసులను ఆశ్రయించారు. తనతో పాటు తన సోదరి గుర్రం మీనా వీసా ప్రాసెసింగ్ కోసం ఈ ఏడాది జనవరిలో కన్సల్టెన్సీ ప్రతినిధులు జ్యోతి నాగ, ఆశిష్ ఆనంద్, రమ్య కృష్ణన్, రమ్య రవికృష్ణను కలిసి ఒప్పందం కుదుర్చుకున్నామని, వారికి ఆన్లైన్ ద్వారా రూ. 2 లక్షలు చెల్లించామని చెప్పారు. అయితే, ఏప్రిల్ నెలలో కెనడాలోని ఓ విశ్వవిద్యాలయం తన దరఖాస్తును తిరస్కరించిందని సమాచారం అందడంతో, కట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా నిర్వాహకులు కాలయాపన చేశారు. చివరకు రిఫండ్ ఇచ్చేది లేదని నిందితులు తేల్చి చెప్పడంతో.. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
