పాక్ F-16లను తరిమికొట్టిన సుఖోయ్

పాక్ F-16లను తరిమికొట్టిన సుఖోయ్

సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చగొట్టే పనులు చేస్తూనే ఉంది. ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఏదో ఒక దాడికి మాస్టర్ ప్లాన్ చేస్తున్న పాకిస్తాన్.. నిన్న( సోమవారం) ఉదయం నాలుగు F-16 ఫైటర్ జెట్స్ తో భారత భూభాగంలో దాడి చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. 4 జెట్స్ సహా ఒక మానవ రహిత విమానాన్ని భారత రాడార్లు గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో వెంటనే భారత్ కూడా సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలను రివర్స్ ఎటాక్ చేసేందుకు రంగంలోకి దింపడంతో పాక్ F-16 ఫైటర్ జెట్స్ వెనక్కి వెళ్లిపోయాయి.

సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పంజాబ్ లోని ఖేమ్ కరన్ ప్రాంతానికి దగ్గరగా పాక్ F-16 జెట్స్ వచ్చినట్టు గుర్తించారు. ఇటీవలే పూంఛ్ సెక్టార్ కు 10 కిలోమీటర్ల దూరంలో పాక్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. వీటిని భారత్ సమర్థంగా అడ్డుకుంది. ఇప్పటికే చాలా డ్రోన్లను భారత భూభాగంలోకి పంపేందుకు పాక్ ప్రయత్నించింది. వాటిని ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సకాలంలో గుర్తించి కూల్చేశాయి.

మరోవైపు ఫిబ్రవరి 27 న జరిగిన దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన JF -17 కూలిపోయిందని, F-16 కాదని పాక్ క్లారిటీ ఇచ్చింది. అయితే భారత్ పై దాడికి వినియోగించింది F-16 అని ఆధారాలు చూపినా.. పాకిస్తాన్ రక్షణ కోసం ఏ యుద్ధ విమానాన్నైనా వాడే అధికారం తమకుందని పాక్ చెప్పింది. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేస్తే… వాటిని ఓర్వలేని దాయాది మాత్రం… భారత్ కీలక స్థావరాలపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతోంది. అమెరికా తయారీ F-16 యుద్ధ విమానాలు ఆ దేశంతో జరిగిన ఒప్పందం ప్రకారం కేవలం ఉగ్రవాదంపై పోరాటానికి మాత్రమే వినియోగించాలి. కానీ వాటిని భారత్ పై ప్రయోగిస్తోంది పాక్.