V6 News

Pakistan: డ్రగ్స్ టెస్టులో అడ్డంగా దొరికిన పాకిస్తాన్ క్రికెటర్.. 

Pakistan: డ్రగ్స్ టెస్టులో అడ్డంగా దొరికిన పాకిస్తాన్ క్రికెటర్.. 

Pakistan: భారత్– శ్రీలంక వేదికలుగా జరిగిన T20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ వాడినట్లు బయటపడింది. వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను (Recreational Drugs) అతను ఉపయోగించినట్లు పరీక్షల్లో తేలింది. అయితే ఈ వివాదం కారణంగా ఇంగ్లాండ్‌లో జరగబోయే T20 బ్లాస్ట్ టోర్నీలో సరీ క్లబ్ తరపున ఆడే అవకాశాన్ని నవాజ్ కోల్పోయాడు. ఇప్పటికే PCB నుంచి నిరభ్యంతర పత్రం (NOC)  లభించినప్పటికీ, డ్రగ్స్ ఉదంతంతో ఆ క్లబ్ అతడితో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇక సల్మాన్ ఆఘా సారథ్యంలో ఆడిన పాక్ జట్టులో నవాజ్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో సహా టోర్నీ మొత్తంలో అతను 7 వికెట్లు పడగొట్టాడు. 

రీక్రియేషనల్ డ్రగ్ యూజ్ అంటే ఏమిటి?: 
సాధారణంగా క్రీడాకారులు తమ ప్రదర్శనను మరింత పెంచుకోవడానికి వాడే మందులను 'పర్ఫార్మెన్స్ ఎన్‌హాన్సింగ్ డ్రగ్స్' అంటారు. కానీ రీక్రియేషనల్ డ్రగ్స్ అంటే కేవలం వినోదం కోసం లేదా వ్యక్తిగత కారణాలతో వాడేవి. ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం, ఆటను మెరుగుపరచకపోయినా సరే, ఇలాంటి పదార్థాలని ఉపయోగించడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది. దీనివల్ల సదరు ఆటగాడిపై నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ విషయాన్ని PCB దృష్టికి తీసుకువెళ్లగా, బోర్డు అధికారికంగా విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయిన తర్వాత ఫలితాలను ICCకి నివేదిస్తామని PCB ప్రతినిధి తెలిపారు. కాగా, నవాజ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు కావడంతో, ఈ వివాదం వల్ల అతని కెరీర్ ముగిసే ప్రమాదం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విచారణ ముగిసే వరకు అతను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు, ప్రస్తుతం జరుగుతున్న PSL 2026లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున నవాజ్ ఆడుతున్నారు. నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో కూడా అతను బౌలింగ్ చేశాడు.