V6 News

ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు.. వివరణ కోరుతూ ఖర్గేకు ఈసీ నోటీసులు

ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు.. వివరణ కోరుతూ ఖర్గేకు ఈసీ నోటీసులు

ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఆయనకు ఈసీ నోటీసులు పంపింది. ప్రధాని మోడీని ఖర్గే 'ఉగ్రవాది' అని సంభోదించారని.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇతర బీజేపీ నాయకులతో కూడిన బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే మల్లిఖార్జున్ ఖర్గే స్పందన కోరుతూ ఈసీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఆ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఎన్నికల సంఘం 24 గంటల్లోగా ఖర్గే నుంచి వివరణ కోరింది. 

మోడీని టెర్రరిస్ట్‌‌‌‌ అని అనలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఖర్గే ఇప్పటికే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని తన మాటలతో ప్రజలను, రాజకీయ పార్టీలను భయపెడ్తున్నారనే అర్థంలో తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు.

ఖర్గే మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను మోడీని టెర్రరిస్ట్‌‌‌‌ అని అనలేదు. ఆయన ఎప్పుడూ ప్రజలను, పొలిటికల్‌‌‌‌ పార్టీలను బెదిరిస్తుంటారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రజలను, పార్టీలను టెర్రరైజ్‌‌‌‌ చేస్తూంటారని చెప్పిన”అని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. అంతకుముందురోజు.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీ బీజేపీతో కూటమిగా ఏర్పడటాన్ని ఖర్గే విమర్శించారు.

Also Read ; తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పట్టుబడ్డ క్యాష్

“అన్నాదురై వంటి నేతల ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకునే ఆ పార్టీ, మోడీతో ఎలా చేతులు కలుపుతుంది? ఆయన టెర్రరిస్ట్‌‌‌‌లాంటోడు. వాళ్ల పార్టీ న్యాయం, సమానత్వాన్ని నమ్మదు. అన్నా డీఎంకే నేతలు వారితో కలుస్తున్నారు అంటే.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నట్లే” అని ఖర్గే విమర్శించారు.

ఈ కామెంట్లను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్‌‌‌‌ ఒక అర్బన్‌‌‌‌ నక్సల్‌‌‌‌ పార్టీ అని, అందుకే ఖర్గే ఇలాంటి భాషను వాడుతారని బీజేపీ ప్రతినిధి ప్రదీప్‌‌‌‌ భండారి మండిపడ్డారు. ఈ కామెంట్లకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్‌‌‌‌ గోయల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు.