తన వారి కోసం వెతుకుతూ పాకిస్తాన్ నుంచి బాసరకు..

తన వారి కోసం వెతుకుతూ పాకిస్తాన్ నుంచి బాసరకు..

బాసర చుట్టుపక్కల ప్రాంతాల్లో కలియతిరిగిన ‘గీత’

బాసర, వెలుగు: మాటలు రావు.. వినపడదు.. సైగలతోనే పాకిస్తాన్ ‘గీత’ దాటుకుని వచ్చింది. తన వారి కోసం.. తన పుట్టినింటి కోసం.. ఐదేళ్లుగా వెతుకుతున్నది. అలా వెతుకుతూ మన రాష్ట్రంలోకి వచ్చింది. మంగళవారం బాసర చుట్టు పక్క ప్రాంతాలు కలియతిరిగింది.. తన వారి జాడ తెలియక మళ్లీ వచ్చిన దారిలోనే వెనుదిరిగింది. ఐదేండ్ల కిందట పాకిస్తాన్ నుంచి వచ్చిన చెవిటి, మూగ యువతి గీత గురించే ఇదంతా!

సుష్మా చొరవతో వచ్చి..

చిన్నప్పుడు తప్పిపోయి పాకిస్తాన్‌‌‌‌లో చిక్కుకుపోయింది గీత. దాదాపు 15 ఏండ్లు అక్కడి ఈద్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌లో ఉంది. ఐదేండ్ల కిందట అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో దేశంలోకి అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ ఆశ్రమంలో ఉంటోంది. గీత తన హావభావాలతో.. తన ఇల్లు గోదావరి నది ఒడ్డున ఉందని, అక్కడ రైల్వే స్టేషన్ తో పాటు ఒక అమ్మవారి గుడి ఉందని ఆశ్రమ నిర్వాహకులకు చెప్పడంతో వారు బాసరకు వచ్చారు. స్థానిక ఎమ్మార్వో శివప్రసాద్, ఎస్సై ప్రేమ్‌‌‌‌దీప్ సాయంతో చుట్టుపక్కల ప్రాంతాలను గీతకు చూపించారు. అయితే అప్పటికి, ఇప్పటికి చాలా మారిపోవడంతో గీతకు ఏమీ అర్థం కాలేదని, సరిగ్గా గుర్తుపట్టలేదని ఆశ్రమ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఇండోర్ నుంచి వచ్చిన గీత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు వెళ్లిపోయింది.