విద్యా సంస్కరణలకుతల్లిదండ్రులు సహకరించాలి..క్లాస్ రూమ్ దాటి పిల్లలకు ప్రపంచాన్ని చూపాలి: కే కేశవరావు

విద్యా సంస్కరణలకుతల్లిదండ్రులు సహకరించాలి..క్లాస్ రూమ్ దాటి పిల్లలకు ప్రపంచాన్ని చూపాలి: కే కేశవరావు
  • అన్ని రంగాల్లో పిల్లలు రాణించేలా ప్రోత్సహించాలని సూచన 
  • ముగిసిన విద్య వారోత్సవాలు 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలంటే తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమని ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారు కె. కేశవరావు అన్నారు. 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న ‘విద్య వారోత్సవాలు – విద్య విజయోత్సవం’ శనివారం ఎంసీఆర్ హెచ్‌‌ఆర్‌‌డీలో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. రాష్ట్ర స్థాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌‌ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులను టీచర్లు కేవలం క్లాస్ రూమ్ పాఠాలకే పరిమితం చేయకూడదు. వారిలో ఊహాశక్తిని, నైపుణ్యాన్ని వెలికితీసేలా బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయాలి. సాహిత్యం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించాలి’’ అని సూచించారు. బట్టీ పట్టే పాత పద్ధతులకు స్వస్తి పలికి.. సబ్జెక్టును అర్థం చేసుకోవడం, సృజనాత్మకత, అప్లికేషన్ మెథడ్స్‌‌ పై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. కవితలు రాసిన సిటీ కాలేజీ విద్యార్థిని హరిప్రియను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

విదేశీ పర్యటనకు 500 మంది టీచర్లు: యోగితారాణా

ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు ఎస్సెస్సీ, ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపారని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రశంసించారు. ‘‘వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో భారీ స్థాయిలో ప్రీ-ప్రైమరీ సెక్షన్లు ప్రారంభిస్తున్నాం. టీచర్ల బోధనా నైపుణ్యం పెంచేందుకు 500 మంది ఉపాధ్యాయులను విదేశీ పర్యటనలకు పంపిస్తాం’’ అని ఆమె వెల్లడించారు.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన మాట్లాడుతూ.. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ క్యాంప్స్, బడిబాట, లైబ్రరీ డే వంటి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్లకు నగదు బహుమతులు అందజేశారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వంద శాతం హాజరు సాధించిన టీచర్లు, స్టూడెంట్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.