రెండు రోజుల్లో రెండో ప్రమాదం.. బీహార్లో మంటల్లో తగలబడిపోయిన ప్యాసెంజర్ ట్రైన్

రెండు రోజుల్లో రెండో ప్రమాదం..  బీహార్లో మంటల్లో తగలబడిపోయిన ప్యాసెంజర్ ట్రైన్

వరుస ప్రమాదాలు రైల్వే శాఖను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం (మే 17) మధ్యప్రదేశ్ రైలు ప్రమాదం మరువక ముందే.. బీహార్లో మరో రైలు అగ్నికి ఆహుతైపోయింది. 2026 మే 18న బీహార్ లోని ససారం రైల్వే స్టేషన్ లో ట్రైన్ మంటల్లో కాలిపోయింది. ససారం నుంచి పాట్నా వెళ్తున్న రైలు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదానికి గురైంది. 

రైలు ఒక కోచ్ పూర్తిగా అగ్నికి దగ్ధమైపోయింది. మంటలు అంటుకున్న భోగీని రైలు నుంచి వేరు చేశారు రైల్వే సిబ్బంది. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే చెలరేగినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. 

ప్రమాదం జరిగిన తర్వాత మంటలు అదుపు చేయడంలో రైల్వే సిబ్బంది విఫలమయ్యారని స్థానికులు, ప్రయాణీకులు ఆరోపించారు. ఎమర్జెన్సీ పరిస్థితుల ఎదుర్కొనేందుకు ముందస్తు సమాయత్తత లేకపోవడం స్పష్టంగా కనిపిస్తున్నట్లు మండిపడుతున్నారు. సరైన సమయంలో నీళ్లు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అంతకు ముందు ఆదివారం  మధ్యప్రదేశ్‌‌లోని రత్లాం జిల్లాలో తిరువనంతపురం– హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌‌ప్రెస్ (12431)లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బీ-1  ఏసీ కోచ్‌‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  గార్డు లోకో పైలట్‌‌ను అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేశారు. 68 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణ, దేశవ్యాప్త రైలు కోచ్‌‌ ల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్​కు ఆదేశించింది.