కదులుతున్న రైలులో చోరీకి యత్నం...సీన్ రివర్స్

కదులుతున్న రైలులో చోరీకి యత్నం...సీన్ రివర్స్

అనుకున్నది ఒకటైతే.. అయినది ఒకటి అన్నట్టుగా ఉంది ఓ దొంగ పరిస్థితి. కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ చోరీకని వచ్చి.. పట్టుబడ్డాడు. అది ఎలా అంటే  స్టేషన్‌ నుంచి కదులుతున్న రైలులో ఓ దొంగ మొబైల్‌ ఫోన్‌ చోరీకి యత్నించాడు. ప్రయాణికులు వెంటనే  అతడి చేతులు పట్టుకున్నారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల వరకు ఆ దొంగ రైలు కిటికీ బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. బిహార్‌లోని ఖగారియాలో జరిగిన ఈ ఘటన... ఈ నెల 14న బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో జరిగింది. ఇది సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ నుంచి బయలుదేరింది. 

చోరీకి వచ్చిన ఆ దొంగ చేతులను ప్రయాణికులు గట్టిగా పట్టుకునేసరికి...ఆ దొంగ క్షమించమని ప్రాధేయపడ్డాడు. తనను వదిలిపెట్టమని వేడుకున్నాడు. అయినప్పటికీ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టలేదు. గట్టిగా లోపలకు లాగి పట్టుకున్నారు. అలా 15 కిలో మీటర్ల ప్రయాణం తర్వాత ఖగారియా స్టేషన్‌ సమీపిస్తుండగా ఆ దొంగ చేతులను ప్రయాణికులు విడిచిపెట్టారు. దీంతో ఆ దొంగ అక్కడి నుంచి పరుగులు తీసి పారిపోయాడు. మరోవైపు ఆ కంపార్ట్‌మెంట్‌లోని కొందరు ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియోను సోషల్‌ మీడియాలో  పోస్ట్ చేయగా వైరల్‌ అయ్యింది.