- ఇది ముమ్మాటికి పైశాచిక ఆనందమే: కేటీఆర్
- కేసీఆర్‌తో రేవంత్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్
- నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. స్వయంగా కేసీఆరే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా.. ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమన్నారు. ఇది అహంకారం కాకపోతే ఏంటని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
‘‘65 ఏండ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్‌నూ పోలీసులు అతిక్రమిస్తున్నారు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇలా ప్రతిపక్ష నేతలను వేధించడమే పనా? చట్టం, న్యాయం, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు.. కానీ, మాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు’’అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్త నిరసనలు
మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ అక్రమమని, రాజకీయ కక్షసాధింపు చర్యని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇటు తెలంగాణభవన్‌కు వేలాది మంది కార్యకర్తలు తరలిరావాలని సూచించింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌ను వేధిస్తున్నదని మధుసూదనా చారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద్ తదితరులు మండిపడ్డారు.
