కొత్తగూడెం పోలీస్ ఆఫీసర్ కు కరోనా తగ్గకముందే డిశ్చార్జ్

కొత్తగూడెం పోలీస్ ఆఫీసర్ కు కరోనా తగ్గకముందే డిశ్చార్జ్
  • పేషెంట్‌‌ను వెనక్కిరప్పించిన డాక్టర్లు
  • చెస్ట్ హాస్పిటల్‌‌ లో ఘటన

కరోనా నుంచి పూర్తిగా కోలుకోకుండానే చెస్ట్‌‌‌ హాస్పిటల్‌ నుంచి ఓ పేషెంట్‌‌‌‌ను గురువారం డిశ్చార్జ్‌‌‌‌ చేశారు. జరిగిన తప్పును గుర్తించి, శుక్రవారం మళ్లీ ఆయన్ను వెనక్కి పిలిపించారు. లండన్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనతో పాటు ఆయన తండ్రి (పోలీస్ ఆఫీసర్), వాళ్లింట్లో పని చేసే మహిళకు పాజిటివ్ రావడంతో వారందరినీ ట్రీట్మెంట్ కోసం గత నెల 23న హైదరాబాద్ కు తరలించారు. లండన్ నంచి వచ్చిన వ్యక్తి కోలుకుని నెగెటివ్ రిపోర్టు రావడంతో ఆయనను ఇటీవలే హైదరాబాద్ నుంచి డాక్టర్లు కొత్తగూడానికి పంపించారు. ఆ యువకుడి తండ్రిని సైతం గురువారం డిశ్చార్జి చేశారు. హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు. పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్లి ఒక్కరోజు కూడా గడవకముందే హాస్పిటల్ నుంచి మళ్లీ పిలుపొచ్చింది. దీంతో స్థానిక డాక్టర్లు ఆయనను శుక్రవారం తిరిగి హైదరాబాద్ కు తరలించారు. కరోనా పేషెంట్లకు 24 గంటల్లో రెండు సార్లు వైరస్ నెగటివ్ వస్తేనే డిశ్చార్జ్‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పేషెంట్‌‌‌‌కు తొలుత చేసిన టెస్టులో నెగటివ్ రాగా, రెండోసారి చేసిన టెస్టులో పాజిటివ్‌‌‌‌ వచ్చింది. రెండో టెస్ట్రిజల్ట్‌‌‌‌ను పాజిటివ్‌‌‌‌కు బదులు నెగటివ్‌‌‌‌గా పేర్కొనడంతోనే ఈ పొరపాటు జరిగిందని చెస్ట్ హాస్పిటల్‌సూపరింటెండెంట్‌‌‌‌, డాక్టర్ మహబూబ్‌‌‌‌ఖాన్‌ తెలిపారు. పేషెంట్‌‌‌‌ను వెనక్కిరప్పించామని, డిశ్చార్జ్‌‌‌‌ తర్వాత పేషెంట్‌‌‌‌తో కాంటాక్టటైన ముగ్గురిని క్వారంటైన్ చేశామని చెప్పారు.