తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ..ఆ పార్టీ స్టేట్చీఫ్వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ..ఆ పార్టీ స్టేట్చీఫ్వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • తెలంగాణ రైతులకు మేలు చేసే ఆలోచన మోదీ సర్కార్​కు ఉందా అని నిలదీత

హైదరాబాద్, వెలుగు: తెలంగాణపై బీజేపీది దొంగ ప్రేమ మాత్రమేనని మరోసారి తేలిపోయిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను కలిసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమయం కోరారా.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అనడంపై పీసీసీ చీఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రేవంత్ ఎలాంటి అపాయింట్ మెంట్ కోరలేదని సీఎం ఫడ్నవీస్ ఆఫీసు చెప్పినట్లు రాంచందర్ రావు ఎలా మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మే 6న, సీఎం రేవంత్ రెడ్డి మే 26న మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసిన విషయం బీజేపీ అధ్యక్షునికి తెలియకపోవడమనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

తుమ్మిడిహెట్టి విషయంలో, ధాన్యం కొనుగోళ్లపై అసలు బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టం చేయాలని మహేశ్ గౌడ్ రాంచందర్​రావును డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు మేలు చేయాలనే ఆలోచన మోదీ సర్కార్ కు ఉందా.. లేదా.. అనేది బీజేపీ నేతలు చర్చకు రావాలని పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు.