సామాన్యులపై పెను భారం..పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్

సామాన్యులపై పెను భారం..పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్
  •     కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలి: మంత్రి పొన్నం 

హైదరాబాద్, వెలుగు: దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై పెను భారం మోపారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయిల్ రేట్లను పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని ఆరోపించారు. ఇది పేదలను పట్టించుకునే ప్రభుత్వం కాదని, కేవలం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వమని విమర్శించారు. 

ఇప్పటికే గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలతో వారి జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న సమయంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కంటే పన్నుల వసూళ్లపైనే కేంద్రానికి ఆసక్తి ఎక్కువని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిఘటన తప్పదని మహేశ్ గౌడ్ హెచ్చరించారు. 

నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయి, ఇంకా సీఎంల ప్రమాణ స్వీకారం కూడా కాకముందే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దేశ ప్రజలను బీజేపీ వంచించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఆయిల్ ధరలు పెరగవని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలుసార్లు మీడియా ముందు ప్రకటించారని, మరి ఇప్పుడు వారు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఈ పెంపుపై కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల పెంపును కాంగ్రెస్  వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.