- ఎవరికి వారే తామే పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులమని ప్రకటించుకోవడంపై ఫైర్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ నేతల తీరుపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారే తామే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో మంగళవారం గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగింది. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థులు ఎవరనేది పీసీసీ నిర్ణయిస్తుందని, ఇలా ఎవరికి వారే తామే అభ్యర్థులమని ఇంకోసారి ప్రకటించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి చేసిన ఫిర్యాదులపై కూడా చర్చించామని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణమైన కృష్ణ కిషోర్ రెడ్డి, హరి ప్రసాద్ లు కూడా తమ వాదనలు వినిపించారని, ఇక నుంచి ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారని మల్లు రవి వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో పార్టీ పరంగా ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మల్లు రవి ఫైర్
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. రేవంత్ కు ఉన్న ఇమేజ్ ను చెడగొట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ మళ్లీ తానే సీఎం అవుతానని ప్రకటించుకునే శక్తి ఉన్న నేత రేవంత్ అని కొనియాడారు. ఎత్తుకు పైఎత్తులు వేసి తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలడనే నమ్మకం తమకు ఉందన్నారు. రేవంత్ తెలంగాణ సీఎం, ఇది బీహార్ కాదు, పశ్చిమ బెంగాల్ కాదు, రేవంత్ ను ఉద్దేశించి అర్వింద్ మాట్లాడడానికి అని మల్లు రవి మండిపడ్డారు.
కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలతో రేవంత్ కు విభేదాలు సృష్టించి, వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను తప్పిస్తే తమకు అవకాశం వస్తుందని ముగ్గురు బీజేపీ ఎంపీలు చూస్తున్నారని మల్లు రవి అన్నారు. బండి సంజయ్ కొడుకు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. సంజయ్ ని రాజీనామా చేయాలని కోరుతున్న కేటీఆర్.. కవిత జైల్లో ఉన్నప్పుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు.
